Moral Story: 64

 *నీతి కథలు - 64*

*తగిన శాస్తి!*

మోతీహారీ గ్రామంలో రఘులాల్ అనే ఒక పేదరైతు ఉండేవాడు. అదే గ్రామంలో ప్యారేలాల్ అనే ధనికుడైన వడ్డీవ్యాపారి ఉండేవాడు. గ్రామస్థులకు అధిక వడ్డీలకు అప్పులిచ్చి,మోసం చేసి అతడు డబ్బులు కూడబెట్టాడు. వడ్డీవ్యాపారి చేసే కుతంత్రాలు గ్రామస్థులకు తెలుసు. అయినా, అవసరాలలో తమను ఆదుకునే దిక్కు మరెవ్వరూ లేరుగనక, తాము మోసపోతున్నామని తెలిసినా, గ్రామస్థులు సాయం కోసం ప్యారేలాల్‌నే ఆశ్రయించేవారు. అందువల్ల అప్పులు చేసే ప్రజలు నానాటికి మరింత పేదలుగా మారుతూంటే, అప్పులిచ్చే వ్యాపారి మరింత ధనికుడుగా ఎదగసాగాడు.

ప్యారేలాల్ డబ్బు అప్పుగా ఇచ్చేప్పుడు పత్రాలు రాసుకునేవాడు కాదు. ‘‘పత్రాల మీద సంతకాలెందుకు? మీకు డబ్బుకావాలి. నేను ఇస్తున్నాను. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు తిరిగి చెల్లించండి. అయితే, వడ్డీ మాత్రం నెల నెలా చెల్లిస్తూ రావాలి. అది చాలు,’’ అనేవాడు. అప్పు పుచ్చుకున్నవారికి యేడాది పొడవునా, తాము పుచ్చుకున్నదానికన్నా ఎక్కువగానే వడ్డీ చెల్లించినట్టు అనిపించేది. అయితే, అసలు డబ్బు ఏమాత్రం తగ్గకుండా అలాగే ఉండేది. ప్యారేలాల్ లెక్కలు వారికి అంతుబట్టేవి కాదు.

రఘులాల్ కూడా ప్యారేలాల్ దగ్గర అప్పు చేశాడు. డబ్బుల్లేనప్పుడు వడ్డీ కింద ప్యారేలాల్ ధాన్యం పట్టుకు పోయేవాడు. కొద్ది కొద్దిగా పొలాన్ని చేజిక్కించుకునేవాడు. ఏదీ లేదంటే ఇంట్లో ఉన్న పాత్రసామగ్రిని పట్టుకుపోయే వాడు. ఒక నెల కనిపించక పోయేసరికి రఘులాల్ ఇంటికి ఆతృతగా వెళ్ళాడు ప్యారేలాల్. ఇంటి నుంచి వెలుపలికి వచ్చిన రఘులాల్, ‘‘అయ్యా, కట్టుబట్టలు తప్ప నా దగ్గర మరేదీ లేదు. మార్చుకోవడానికి కూడా వేరే బట్టలు లేవు. నన్నేం చేయమంటారు?’’ అన్నాడు విచారంగా.

‘‘సాయం అర్థించడానికి రాముడి వద్దకు ఎందుకు వెళ్ళకూడదు? నా పట్ల అతడెంతో కరుణ చూపేవాడు. వెళ్ళిరా, నేను కొన్నాళ్ళ తరవాత వస్తాను,’’ అని చెప్పి ప్యారేలాల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.


‘‘ఆ రాముడు, ప్యారేలాల్‌కు సాయం చేసి వుంటే, నాకూ తప్పక సాయం చేయగలడు. ఇప్పుడే బయలుదేరాలి,’’ అనుకుంటూ రఘు లాల్ అప్పటికప్పుడే రాముణ్ణి వెతుక్కుంటూ బయలుదేరాడు. నడిచాడు, నడిచాడు సాయంకాలం వరకు నడిచాడు. రాముణ్ణి గురించి ఆచూకీ చెప్పేవారు ఒక్కరూ కనిపించలేదు. ఆఖరికి ఒక పూజారిలాంటి మనిషి కనిపించగానే, ‘‘నాదగ్గరున్న మూడు రొట్టెల్లో ఒకటి ఇస్తాను. దయాపరుడైన రాముణ్ణి నేనెక్కడ చూడగలనో చెబుతావా?’’ అని అడిగాడు.

అతడు ఏమీ పలక్కుండా రొట్టెముక్క కేసి కనీసం క్షణం కూడా చూడకుండా ఏదో మనసులో గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. రఘు లాల్ మరికొంత దూరం నడిచాక, ముఖాన విబూదిరేఖలతో ఒక సాధువు ఎదురయ్యాడు. ఆయన చేతిలో ఒక రొట్టెముక్కను పెట్టి, ‘‘రాముడెక్కడ ఉంటాడు? ఆయన ఉండే చోటు మీకు తప్పక తెలిసే ఉంటుంది,’’ అన్నాడు రఘులాల్. ‘‘నాకు శివుణ్ణి గురించే తెలుసు. రాముణ్ణి గురించి తెలియదు,’’ అంటూ వెళ్ళిపోయాడు ఆ సాధువు.

రఘులాల్ అలా నడుస్తూ నడుస్తూ బాగా అలిసి పోయాడు. ఎవరైనా ఎదురుపడి రాముడుండే చోటు చెప్పక పోతారా, వారితో కలిసి రొట్టెలు పంచుకుని తినకపోతానా అన్న ఆశ కొద్దీ ఆకలిగా ఉన్నప్పటికీ రొట్టెలు తినకుండానే నడవసాగాడు. ఆఖరికి చింపిరి దుస్తులతో ఒక పేదవాడు ఎదురుపడ్డాడు. అతడూ బాగా అలిసిపోయి కనిపించాడు. ‘‘నేను రాముడి కోసం వెళుతున్నాను. ఆయన నాకు సాయపడ గలడని చెబుతున్నారు,’’ అంటూ రొట్టెల మూటను విప్పాడు.

‘‘అలాగా! నువ్వు రాముణ్ణి చూడాలని వెళుతున్నావా? నేనే రాముణ్ణి. నేనేం సాయం చేయగలనో చెప్పు,’’ అన్నాడతడు రొట్టెల కేసి ఆత్రంగా చూస్తూ.
‘‘ఇదిగో, ఈ రొట్టె తీసుకో,’’ అంటూ రఘులాల్ అతడి చేతికి ఒక రొట్టె ఇచ్చాడు. ఇద్దరూ తినడం ప్రారంభించారు. ఆ తరవాత తను వడ్డీ వ్యాపారి ద్వారా ఎలా మోసపోయిందీ ఏకరువు పెట్టి, ‘‘నా వద్ద ఇప్పుడు డబ్బులూ లేవు, ధాన్యమూ లేదు. కుంట పొలం కూడా లేదు. ఎలా బతకాలో తెలియడం లేదు,’’ అన్నాడు రఘులాల్ విచారంగా.


ఆకలి తీరిన పేదవాడు తన సంచీలో నుంచి ఒక శంఖాన్ని తీసి, రఘులాల్‌కి ఇచ్చి, ‘‘దీనిని ఇలా ఊదావంటే నీకు కావలసినది ఇస్తుంది. దీన్ని ఊదే శక్తి నాకు లేదు. గనక, నాకు ఉపయోగపడదు. నువ్వే తీసుకో. మళ్ళీ వడ్డీ వ్యాపారి చేత మోసపోకుండా మాత్రం జాగ్రత్తపడు,’’ అని చెప్పి తనదారిన వెళ్ళిపోయాడు.

రఘులాల్ ఇంటికి తిరిగి వచ్చాడు. తలుపులూ, కిటికీలూ మూసి వచ్చి శంఖాన్ని ఇటూ అటూ తిప్పుతూ ఊదసాగాడు. అతడు దాన్ని ఒక విధంగా పట్టుకుని ఊదినప్పుడు నాణాలు రాలాయి. అతడు దురాశాపరుడు కాదు గనక, అంతటితో ఊదడం ఆపాడు. ఆరోజు తనకు కావలసిన ఆహారం కొనడానికి చాలినన్ని నాణాలు ఉంటే చాలనుకున్నాడు. ఆ రోజంతా విశ్రాంతి తీసుకుని, మరునాడు తెల్లవారగానే తనకున్న కొద్దిపాటి పొలంలో పనిచేయడానికి వెళ్ళాడు.

కొన్ని నెలలు గడిచాయి. ఒకనాడు ప్యారేలాల్ కోతకు సిద్ధంగా ఉన్న రఘులాల్ చిన్న పంట పొలాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తిను బండారాలు తీసుకుని రఘులాల్ ఇంటికి వెళ్ళి, ‘‘మళ్ళీ నీ ఇంటికి సంపద కలగడం నా కెంతో ఆనందంగా ఉంది రఘులాల్. నేను ఇప్పుడు పాతబాకీ వసూలు చేసుకోవడానికి రాలేదు. నీ విజయ రహస్యం  ఏమిటి? ఇంత సంపద ఎలా కలిగింది? అది చెప్పు చాలు,’’ అన్నాడు నవ్వుతూ.

వెర్రిబాగులవాడైన రఘులాల్ శంఖాన్ని తీసి చూపుతూ, ‘‘నా సంపదకంతటికీ ఇదే కారణం,’’ అన్నాడు.

ప్యారేలాల్ శంఖాన్నెలాగైనా రైతు నుంచి కాజేయాలనుకుని పథకం వేశాడు. కొంతసేపు ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ గడిపి, బయలుదేరేప్పుడు శంఖాన్ని చాకచక్యంగా దుస్తుల్లో దాచుకుని వెళ్ళిపోయాడు. తనకు శంఖం అవసరం అప్పటికి లేదు గనక, రఘులాల్ కూడా అది ఎక్కడుందో పట్టించుకోలేదు.

ఇంటికి చేరిన ప్యారేలాల్ శంఖాన్ని ఊదడానికి ప్రయత్నించాడు. అయితే ఎంత ప్రయత్నించినా ఎలాంటి శబ్దమూ రాలేదు. రెండు రోజులు గడిచాయి. మూడో రోజు ప్యారేలాల్ మళ్ళీ రఘులాల్ వద్దకు వెళ్ళి, ‘‘మిత్రమా, ఆ రోజు నీకో మాట చెప్పడం మరిచాను. నువ్వు చూపిన శంఖాన్ని చూసి దాని అందానికి ముచ్చట పడి నావెంట పట్టుకుపోయాను. ఊదినప్పుడు ఎలాంటి శబ్దమూ రాలేదేంటి? దాని వల్ల నీకిన్ని సిరి సంపదలు సమకూరాయంటే నమ్మశక్యం కాలేదు,’’ అన్నాడు.

రఘులాల్ ఆ శంఖాన్ని తీసుకుని ఊదాడు. గలగలమంటూ శంఖంలోంచి నాణాలు రాలడం చూసిన ప్యారేలాల్ తన కళ్ళను తానే నమ్మ లేకపోయాడు. ‘‘బావుంది, రఘులాల్ చాలా బావుంది. నా దగ్గర నువ్వు తీసుకున్న అప్పు సంగతి ఈ క్షణమే మరిచిపో. అయితే, ఒక్క సంగతి. ఈ శంఖం ఊదడం ద్వారా నీ కెంత ధనం వస్తుందో అంతకు రెండింతలు నాకు వచ్చేలా చూడు, సరేనా?’’  అన్నాడు.


రఘులాల్‌కు కోపం వచ్చింది. ‘‘నువ్వు నన్నెంతకాలమో మోసం చేశావు. అవునా? నువ్వు నా వద్ద నుంచి పుచ్చుకున్న అదనపు డబ్బును నాకివ్వాలి. నా పొలాన్ని మళ్ళీ నాకు అప్పగించాలి. పాత్ర సామగ్రి విషయం కూడా మరిచిపోవద్దు. అవి లేకుండా వంటలు చేసుకో లేకుండా ఉన్నాను,’’ అన్నాడు.

ప్యారేలాల్ శంఖాన్ని అంది పుచ్చుకుని, ‘‘అయితే, దీన్ని నా వద్దే ఉండనివ్వు. నీకూ నాకూ ఇద్దరికీ ఉపయోగపడకూడదు,’’ అంటూ అక్కడి నుంచి బయలు దేరబోయాడు.
రఘులాల్, ‘‘సరే నువ్వు నానుంచి ఇక డబ్బు అడగవన్న మాటను నమ్ముతున్నాను. ఆ శంఖం నాకిచ్చెయ్. అది ఊదినప్పుడు నాకు లభించేవన్నీ రెండింతలు నీకు లభిస్తాయి. అయితే, నా పాత్ర సామానులు ఈ రోజే నాకు ఇవ్వాలి. పొలాన్ని నాపరం చేసి, అందులో పనిచేస్తూన్న నీ కూలీలను ఈ రోజే వెనక్కు తీసుకోవాలి,’’ అన్నాడు.

ప్యారేలాల్ తలవంచుకుని వెళ్ళిపోయాడు. సాయంకాలానికే అతడి పాత్రలు ప్యారేలాల్ పనిమనుషులు తెచ్చి ఇచ్చి వెళ్ళారు. మరు నాడు శంఖాన్ని తీసి, రఘులాల్ నాణాలు రావాలని కోరుకోవడానికి బదులు తన కన్ను ఒకటి పోవాలని కోరుకుంటూ ఊదాడు. మరి కొన్ని రోజులలో ప్యారేలాల్ కూలీలు తన పొలం వదిలి వెళ్ళడం రఘులాల్ చూసి సంతోషించాడు. అప్పటికప్పుడే బయలుదేరి ప్యారేలాల్ వద్దకు వెళ్ళాడు.

రెండు కళ్ళు పోగొట్టుకున్న ప్యారేలాల్, రఘులాల్ కంఠస్వరం వినగానే, చేతిలోని కరన్రు నేలకేసి తడుతూ వచ్చాడు. తగిన శాస్తి జరిగిందని రఘులాల్ సంతోషించాడు.
‘‘రఘులాల్, నేనెన్నో దుర్మార్గాలకు ఒడి గట్టాను. నన్ను క్షమించు. మళ్ళీ నాకు కంటి చూపునివ్వమని నీ శంఖాన్ని కోరుకో. నా జీవితాంతం ఎవరికీ అపకారం తెలపెట్టను. దేవుడి మీద ఒట్టు!’’ అని ప్రాథేయ పడసాగాడు ప్యారేలాల్.

పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న ప్యారేలాల్‌ను చూసి, రఘులాల్‌కు జాలికలిగింది. అతడు చూపు పోయిన తన కంటికి తిరిగి చూపు రావాలనుకుంటూ శంఖం ఊదాడు. మరుక్షణం అతడి కంటితో పాటు ప్యారేలాల్ రెండు కళ్ళకూ చూపువచ్చింది. ఆ తర్వాత నుంచి ప్యారేలాల్ ఎవరినీ మోసగించకుండా, ధర్మవడ్డీకి అప్పులిస్తూ, గ్రామస్థుల చేత మంచివాడనిపించుకున్నాడు.
          
          ◦•●◉✿ - ✿◉●•◦
🌻 *మహానీయుని మాట*🍁
    ◈ ━━━ ⸙ - ⸙ ━━━ ◈
_" సమస్యలంటూ ఏవీ లేవు, ఉన్నవి పరిస్థితులే. మీరు వాటిని ఎలా తీసుకుంటారన్న దాన్నిబట్టే అది ఉంటుంది. "_
                _*- సద్గురు*_
     。☆✼★━━━━★✼☆。
🌹 *నేటీ మంచి మాట* 🌼
     ♡━━━━━ - ━━━━♡
_" తిట్టే వాడికి దగ్గరగా ఉన్న పర్లేదు కానీ పొగిడేవాడికి మాత్రం దూరంగా ఉండండి."

@    Class & Subject wise Study Material :

    #    6th Class    #    7th Class    #    8th Class    #    9th Class    #    10th Class