Moral Story : 63

 *నీతి కథలు - 63*

*మంచి మార్పు*

సహిల్‌, రాత్రి భోజనానికి ఏం చేయమంటావు?’’ అని అడిగింది పదకొండేళ్ళ కొడుకును శ్రీమతి మెహ్రా. ‘‘ఏమైనా చెయ్,’’ అన్నాడు సహిల్‌ ఆమెకేసి తల కూడా తిప్పకుండా. టీవీని కళ్ళప్పగించి చూస్తూ, మధ్యాహ్న భోజనం చేస్తున్నాడు వాడు.

శ్రీమతి మెహ్రా దిగులు పడింది. వాళ్ళబ్బాయి చురుకైన విద్యార్థి. మంచి మార్కులు తెచ్చుకుంటాడు. ఆటల్లోనూ ముందుంటాడు. వాడి కున్న లోపమల్లా ఒక్కటే. ఇంటికి వచ్చాడంటే టీవీ చూడకుండా భోజనం ముట్టుకోడు. ఆఖరికి బిస్కెట్ తినాలన్నా టీవీ ఆన్‌ చేయాల్సిందే. తల్లిదండ్రులు దీన్ని మొదట అంతగా పట్టించు కోలేదు. కాని ఆ తరవాత నయానా, భయానా ఇది మంచి అలవాటు కాదని చెప్పి చూశారు. తిట్టారు. అయినా సహిల్‌ తన అలవాటును మార్చుకోలేక పోయాడు.

బడికి వెళితే, సహిల్‌ శాండ్విచ్‌ రెండు ముక్కలు తింటాడు. అదీ ఆట లాడుతూ మధ్య తింటాడు. అంతే. ఒకరోజు తండ్రి ఆఫీసునుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చినప్పుడు, సహిల్‌ ఎప్పటిలాగే టీవీ చూస్తూ భోజనం చేయడం చూశాడు. సహిల్‌ టీవీ చూడ్డంలో లీనమైపోయి తండ్రి రావడం కూడా గమనించలేదు. మెహ్రాకు కోపం వచ్చింది. దీనికేదైనా పరిష్కారం చూడాలనుకున్నాడు. వెంటనే ఆయనకో ఆలోచన తట్టింది. మెకానిక్‌ను పిలిపించి టీవీ కనెక్షన్‌ తొలగించాడు.

మర్నాడు సహిల్‌ బడినుంచి రాగానే భోజనానికి టీవీ ముందు కూర్చుంటూ టీవీని ఆన్‌ చేశాడు. టీవీ పని చేయడంలేదు. దిగ్భ్రాంతి చెందాడు. రిమోట్‌ని అటూ ఇటూ తిప్పి చూశాడు. తట్టాడు. స్విచ్‌ని చెక్‌ చేశాడు. ప్లగ్‌ సరిగ్గా వుందా లేదా అని పరిశీలించాడు. అయినా టీవీ పనిచేయలేదు. ‘‘నాకు ఆకలిగా లేదు,’’ అంటూ భోజనం చేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.


సాయంకాలం వెలుపలికి వెళ్ళి మిత్రులతో కాస్సేపు ఆడుకున్నాడు. బాగా ఆకలి వేయడంతో ఇంటికి తిరిగి వచ్చాడు. అయినా, టీవీ చూడకుండా ఎలా తినడమా అని బాధ పడ సాగాడు. తండ్రి ఇంటికి రాగానే టీవీ పనిచేయడం లేదని ఫిర్యాదు చేశాడు. ‘‘ఇవాళ ఒంట్లో బావో లేదు. రేపు చూద్దాం,’’ అన్నాడు తండ్రి దాన్ని గురించి అంతగా పట్టించుకోకుండా.
‘‘అదెలా? టీవీ చూడకుండా నేను భోజనం చేయలేనని నీకు తెలియదా? టీవీ లేక పోవడంతో మధ్యాహ్నం కూడా తినలేదు. ఇప్పుడేమో చెప్పలేనంత ఆకలి. ఎలా భోంచేయను?’’ అన్నాడు సహిల్‌.

‘‘నీకు ఆకలిగా వుంటే వెళ్ళి తిను. ఇవాళ టీవీని బాగు చేయించను, అంతే!’’ అన్నాడు మెహ్రా తీవ్రమైన కంఠస్వరంతో. తల్లయినా తనకు మద్దతుగా మాటసాయం చేస్తుందేమోనని సహిల్‌ ఆమె కేసి ఆశగా చూశాడు. ఆమె ఏమీ ఎరగనట్టు గదినుంచి వెలుపలికి వెళ్ళిపోయింది.

సహిల్‌ కాస్సేపు అటూ ఇటూ తిరిగాడు. పళ్ళెం ముందు కూర్చున్నాడు. చాలా ఇబ్బంది  అనిపించింది. ‘‘ప్లీజ్‌ డాడీ, టీవీ రిపేర్‌ చేయించు,’’ అని బతిమాలాడు. ‘‘టీవీ లేకపోతే ఏం? ఆకలేస్తున్నది కదా. తిను నాన్నా,’’ అన్నాడు తండ్రి ఇప్పుడు కాస్త మృదువుగా.

సహిల్‌ పళ్ళెం కేసి చూశాడు. తల్లి తయారు చేసిన భిండి, ధాల్‌, చపాతీలు ఉన్నాయి. భిండి ఎలా వుంటుందో కూడా సహిల్‌కు తెలియదు. ఇన్ని రోజులు టీవీ చూడ్డంలో మునిగిపోయి, ఏ వంటకం రుచి ఎలా వుంటుందో కూడా పట్టించు కోలేదు వాడు. అయితే ఇవాళ వాడు భిండి తింటూన్నప్పుడు చాలా రుచిగా ఉందనిపించింది. మెల్లగా కడుపునిండా తిన్నాడు.

క్రమేణా వాడికి టీవీ చూడకుండానే హాయిగా తినవచ్చనే విషయం అనుభవం ద్వారా అర్థమయింది. అంతే కాదు. వాడురోజూ డైనింగ్‌ టేబుల్‌ ముందు కూర్చుని భోజనం చేస్తూ - తన బడి గురించీ, స్నేహితుల గురించీ, ఉపాధ్యాయుల గురించీ, ఆ రోజు చదివిన పాఠాల గురించీ తల్లిదండ్రులతో ఆసక్తిగా మాట్లాడడం ప్రారంభించాడు. తల్లిదండ్రులు ఆశించింది కూడా అదే కావడంతో వాళ్ళెంతగానో సంతోషించారు.

సహిల్‌ జీవితంలో వచ్చిన ముఖ్యమైన మంచి మార్పుగా దీనిని సహిల్‌, అతని తల్లిదండ్రులు భావించారు.
         
     ◦•●◉✿ - ✿◉●•◦
🌻 *మహానీయుని మాట*🍁
    ◈ ━━━ ⸙ - ⸙ ━━━ ◈
_" ఇతరులను సేవించుట వలన ఏర్పడే సంతోషం అమూల్యమైనది.. ప్రేమను చూపించేందుకు, ప్రేమను పొందే ఒకే ఒక ఉద్దేశ్యంతోనే దేవుడు మనల్నందరినీ సృష్టించియున్నాడు "_
               _*- మదర్ థెరిస్సా*_
     。☆✼★━━━━★✼☆。
🌹 *నేటీ మంచి మాట* 🌼
     ♡━━━━━ - ━━━━♡
_" ప్రేమ శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుంది. "_