Moral Story : 09

💦 *నీతి కథలు - 09*

*దుష్టగుణం*

    హిమాలయ పర్వతశ్రేణులని ఆనుకుని ఉన్న అడవికి ప్రక్కనే ఒక చిన్న గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు.

    ఒకనాడు అతడు పనిపై అడవి మార్గం లోంచి నడచి పోతుండగా ప్రక్కనే అగ్నికి ఆహుతి అవుతున్న పొదలు కనిపించాయి. అందులో ఒక పాము చిక్కుకుని తప్పించుకోలేక ఏడుస్తూ ఆ దారినే పోతున్న బ్రాహ్మణుడిని చూసి ‘అయ్యా ! నన్ను ఎలాగైనా ఈ మంటలనుండి కాపాడి పుణ్యం కట్టుకోండి‘ అని దీనంగా వేడుకుంది. పాము ఏడుపుతో కూడిన వేడుకోలుకి బ్రాహ్మణుడికి జాలి కలిగింది. వెంటనే ఆ చుట్టుప్రక్కలంతా వెతికి ఒక పొడవాటి కర్ర సంపాదించి, తన చేతి సంచికి ఆ కర్రను కట్టి, మంటలు సంచికి తగలకుండా దానిని జాగ్రత్తగా పాము దగ్గరగా చేర్చాడు. పాము గబుక్కున ఆ సంచిలోకి దూరగానే బ్రాహ్మణుడు జాగ్రత్తగా ఆ కర్రను సంచితో సహా బయటకు లాగి, దగ్గరలోనే ఉన్న వేరే పొద వద్దకు తీసుకుని పోయి పాముని అక్కడ వదిలాడు.

    సంచిలోంచి బయటపడిన పాము ‘ఓరీ! మీ మానవజాతిని నమ్మరాదు. మీరు మమ్ములను కర్రతో కొట్టి చంపుతారు. అందుకని ఇప్పుడు నేను నిన్ను చంపుతాను’ అంటూ బుస్సుమని పడగ విప్పి లేచి బ్రాహ్మణుడిని కాటువేయబోయింది. బ్రాహ్మణుడు భయంతో తప్పించుకుని పారిపోతుంటే పాము అతడిని తరుముతూ వెంటబడింది.

    ఇంతలో అటుగా పోతున్న ఒక నక్క పరుగెత్తుతున్న బ్రాహ్మణుడిని చూసి ‘ఓయీ ! ఏమైంది? ఎందుకు పరుగెడుతున్నావు? చెప్పు’ అంది. బ్రాహ్మణుడు ఆయాసంతో భయంతో నోట మాట రాక వణుకుతూ నిలబడ్డాడు. ఇంతలో వెనుకనే తరుముకు వస్తున్న పాము జరిగినదంతా నక్కకు చెప్పింది.

    అంతా విన్న నక్క పాము మాటలు అర్థంకానట్లుగా ముఖం పెట్టి ‘ఇంత పొడవున్న నువ్వు అసలు ఈ చిన్న సంచిలో ఎలా పట్టావు? అదలా ఉంచితే బ్రాహ్మణుడు నిన్ను ఆ మంటల్లోంచి బయటకు ఎలా తెచ్చాడు? ఏమో నీ మాటలు విచిత్రంగా ఉన్నాయి. నువ్వు నిజమే చెప్తున్నావా అని అనుమానం వస్తున్నది. నేను నమ్మలేకున్నాను’ అంది.

    నిజం నక్క బావా! నేను ఈ సంచిలో పట్టాను. కావాలంటే చూడు’ అంటూ పాము మళ్ళీ సంచిలోకి దూరింది.

    నక్క వెంటనే బ్రాహ్మణుడికి సైగ చేసింది. అర్థం చేసుకున్న బ్రాహ్మణుడు గబగబా సంచిమూతి గట్టిగా బిగించి కట్టి, కర్రతో సంచిని మళ్ళీ మంటల పొదలలో వదిలేశాడు. పాము సంచిలోంచి బయటకు రాలేక గిలగిలలాడుతూ ‘ అయ్యో! నన్ను బయటకు తీయండి, కాపాడండి’ అంటూ అరవసాగింది.

    ‘ఓరీ దుష్టుడా! నీప్రాణాలను కాపాడిన బ్రాహ్మణుడినే చంపాలని చూశావు. కనుక ఆ సంచిలోనే పడి ఉండు. నీ కదే తగిన శిక్ష. అనుభవించు’. అని ‘ఓయీ! బ్రాహ్మణుడా, దుష్టుడైన పాముపై జాలిపడి, మేలు చేయబోయి నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు కదా! మళ్ళీ ఇటువంటి పొరపాటు చేయకు. ఇక నీదారిన నీవు వెళ్ళు!’ అని చెప్పి నక్క వెళ్ళిపోయింది.

‘బ్రతుకుజీవుడా’ అనుకుంటూ బ్రాహ్మణుడు అక్కడ్నుండి శరవేగంగా కదిలి తనదారిన తాను వెళ్ళిపోయాడు.

*--దుష్టులకు ఎప్పుడూ దూరంగా ఉండాలి*
          💦🐋🐥🐬💦
          ◦•●◉✿ - ✿◉●•◦
🌻 *మహానీయుని మాట*🍁
    ◈ ━━━ ⸙ - ⸙ ━━━ ◈
_"  నాకు సాయం చేయడానికి రానివారందరికీ కృతఙ్ఞతలు, ఎందుకంటే వారి వల్లనే స్వంతంగా పనిచేయటం నేర్చుకోగలిగాను "_
        _*- అల్బెర్ట్ ఐన్ స్టీన్*_
     。☆✼★━━━━★✼☆。
🌹 *నేటీ మంచి మాట* 🌼
     ♡━━━━━ - ━━━━♡
_" అనంతమైన ద:ఖాన్ని చిన్న నవ్వు చెరిపివేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్కమాట తుడిచివేస్తుంది "_

         💦🐋🐥🐳💦

@    Class & Subject wise Study Material :

    #    6th Class    #    7th Class    #    8th Class    #    9th Class    #    10th Class