Moral Story : 66

 *నీతి కథలు - 66*

*పనికిమాలిన ధనం*

    ఒక దేశంలో ఒక మహాధనికుడుండేవాడు. తాతముత్తాల నుంచి వాళ్ళది ధనిక కుటుంబమే. దానికి తోడు ఆయన ఓడ వర్తకం నుంచి వడ్డీ వ్యాపారం వరకు రకరకాల వ్యాపారాలు చేసి ఏడుతరాలకు సరిపడా డబ్బు కూడబెట్టాడు. అలా ఆయన తను కూడ బెట్టిన ధనమంతా మూడు పీపాలలో ఉంచి, వాటిని నేలమాళిగలో ఉంచాడు.
ఒకదాని నిండా బంగారు నాణాలూ, రెండో దాని నిండా వెండి నాణాలూ, మూడోదాని నిండా రాగి నాణాలూ ఉండేవి. ధనికుడు రోజూ వెళ్ళి వాటిని ఒకసారి పరిశీలనగా ఎంతో ఆశతో చూసి వచ్చేవాడు.

    హఠాత్తుగా ఆ దేశం మీదికి పొరుగుదేశపు సేనలు దండెత్తి వచ్చాయి. అవి అపజయమన్నది లేక  దేశాన్ని జయించుకుంటూ రావటం చూసి ధనికుడు భయపడి పారిపోవటానికి నిశ్చయించాడు. ధనపు పీపాలు వెంట తీసుకు పోవటం అసాధ్యం గనక, ఆయన మైనం కరిగించి, మూడు పీపాలలోని నాణాలమీదా పోయించి, వెళ్ళే హడావుడిలో నేలమాళిగకు తాళం కూడా వెయ్యకుండా సకుటుంబంగా దేశం విడిచి పారిపోయాడు.

    కొద్ది రోజులకు శత్రుసైన్యాలు వచ్చి ధనికుడుండిన నగరాన్ని ఆక్రమించాయి. వాళ్ళ దృష్టి మొదట ధనికుల ఇళ్ళ మీద పడింది.  సేనాపతి దగ్గిర ఉండి ధనికుల ఇళ్ళలో ఉన్నదంతా ఒక్కటి విడిచిపెట్టకుండా స్వాధీన పరచుకుంటున్నాడు. పారిపోయిన ధనికుడి ఇంట గల పెద్దపెద్ద పీపాలు ఆయన దృష్టిలో పడ్డాయి. వాటిని కాస్సేపు పరిశీలనగా చూశాడు.

    ‘‘అవి మైనం పీపాలు, అందుకే ఇంటి యజమాని వాటిని వదిలేసి వెళ్ళాడు. వీటిని ఎవరన్నా కొంటారేమో చూడండి,’’ అని శత్రుసేనాపతి తన భటులకు చెప్పాడు.

వాళ్ళు ఎంత ప్ర…యత్నించినా ఎవరూ వాటిని కొనటానికి రాలేదు. అలా కొన్ని రోజులు గడిచి పోయాయి. చివరకు ఒక పేదవాడు వచ్చి, ‘‘అయ్యా,  నేను మైనంవత్తులు చేసి అమ్ముకుని జీవించే శత్రుసైనికుడొకడు ఆ పేదవాడిచ్చిన చిల్లర డబ్బులు తీసి సంతోషంగా జేబులో వేసుకుని, ‘‘వీటికి కాపలా కాయలేక చస్తున్నాను. ఈ పీపాలను త్వరగా ఇంటికి పట్టించుకుపో,’’ అన్నాడు. మైనంవత్తుల వాడు, కూలీల ద్వారా ఆ మూడు పీపాలనూ తన ఇంటికి చేరవేయించాడు. కాని, వాటిని గురించి కొన్నాళ్ళపాటు అసలు పట్టించుకోలేదు.

    శత్రువులు వెళ్ళిపోయి, పరిస్థితులు కాస్త స్థిమితపడినాక ఆ పేదవాడు మైనం వత్తులు తయారు చేద్దామని ఒక పీపాలోకి చెయ్యి పెట్టేసరికి చేతికేదో గట్టిగా తగిలింది. ఏమిటా అని పైకి తీసి చూస్తే బంగారు నాణాలు! అతడు ఆశ్చర్యపడి ఇంకా జాగ్రత్తగా చూసేసరికి, మైనం కింద పీపానిండా బంగారునాణాలే! అతడి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది.

    పేదవాడు ఆత్రంగా మిగిలిన రెండు పీపాలూ  పరీక్షంచి, వాటి నిండా వెండి, రాగి నాణాలున్నట్టు తెలుసుకున్నాడు. అతనికి అంతులేని ఆశ్చర్యమూ, సంతోషమూ కలిగాయి. అయితే, అతను ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వలేదు. ధనపు పీపాలున్న గదికి గట్టి ద్వారమూ, తాళమూ, మిగిలిన బందోబస్తులూ ఏర్పాటు చేసి, దారిద్య్ర భయం లేకపోయినా, పైకి పటాటోపం ఏమీ కనబడకుండా ఎంతో సుఖంగా జీవయాత్ర గడపసాగాడు.

    కాలం గడుస్తున్నది. ఆ పేదవాడి దగ్గిర ఉన్న నిధి ఎప్పటికి ఖర్చుగాను? ఏ జమీందారు లాగానో ఆడంబరంగా బతకటం ప్రారం భిస్తే, ముప్పుతప్పదు. ఏంచేయడానికీ తోచలేదు. రకరకాల ఆలోచనలతో మరికొన్నాళ్ళు గడిపాడు. ఆ తరవాత ఒకనాడు తన మిత్రుడైన దర్జీ దగ్గిర కొన్ని బట్టలు కుట్టించుకుని అతను దర్జీకి గుప్పెడు బంగారు నాణాలిచ్చాడు.

    దానిని చూసి దర్జీ ఆశ్చర్యపోయి, ‘‘ఇంత డబ్బేమిటి? నేను తీసుకోను. నాశ్రమ ఫలితం నాకు దక్కితే చాలు. నా కుట్టుకూలి నాకిచ్చెయ్యి చాలు,’’ అన్నాడు.
‘‘నా దగ్గిర పీపాడు బంగారం ఉన్నది. ఏం చేసుకునేది? స్నేహితుడు ప్రీతితో ఇచ్చినవి పుచ్చుకోకుండా వద్దంటున్నావు. నువ్వేమైనా ధనవంతుడివి గనకనా? ఈ బంగారం ఉంచు,’’ అన్నాడు మైనంవత్తులు చేసేవాడు.

    ఈ మాటలో దర్జీకి ఏమాత్రం నమ్మకం కుదరలేదు. ఏదో తన నుంచి దాస్తున్నాడనుకున్నాడు. ‘‘అయినా ఇంతలో నీ కంత బంగారం ఎట్లా వచ్చింది? మతి చెడినట్టు మాట్లాడుతున్నావు,’’ అన్నాడు దర్జీ. ‘‘నా వెంటరా. కళ్ళారా చూతువుగాని,’’ అని మైనంవత్తులు చేసేవాడు, శత్రుసైనికుల నుంచి తను పీపాలు కొన్న సంగతి వివరించి తన దర్జీ మిత్రుణ్ణి తీసుకుపోయి, పీపాలలో ఉన్న బంగారు నాణాలూ, వెండి నాణాలూ, రాగి నాణాలూ చూపించి, ‘‘ఇదంతా నేనేం చేసుకునేది? ఇందులో సగం నీ కిస్తాను, పట్టుకుపో!’’ అన్నాడు.

    దర్జీ తన జేబులో రెండు గుప్పిళ్ళు బంగారం నాణాలు తీసి పోసుకుని, ‘‘ఇది చాలు, నేను జీవితాంతందాకా సుఖంగా బతకటానికి. నే నొకటి చెబుతాను విను. ఈ డబ్బు నువ్వు వెయ్యి సంవత్సరాలలో కూడా ఖర్చు చెయ్యలేవు. చచ్చేంత వరకు దీనిని రోజూ చూసి సంతోషించవలసిందే. ఇది వట్టి నిరర్థకమైన డబ్బు. అందుచేత దీన్ని రహస్యంగా పేద వాళ్ళందరికీ పంచెయ్యి. వాళ్ళయినా సుఖపడిపోతారు. డబ్బు సద్వినియోగమవుతుంది,’’ అన్నాడు. మైనంవత్తులు చేసేవాడికీ  సలహా  బాగా నచ్చింది. అతను రహస్యంగా తన వెండి బంగారాలను నిరుపేదలకూ, అవసరాల్లో ఉన్న వాళ్ళకూ చాలావరకు మెల్లమెల్లగా పంచేశాడు. మిగిలిన దానితో జీవితాంతం వరకూ హాయిగా గడిపాడు.
            
          ◦•●◉✿ - ✿◉●•◦
🌻 *మహానీయుని మాట*🍁
    ◈ ━━━ ⸙ - ⸙ ━━━ ◈
_" అలసిపోతున్నామని పనులు ఆపేయకుండా, సోమరిలా మారకుండా, ఎండా వానలకు చలించకుండా ఆనందంగా జీవించడం వంటివి గాడిదను చూసి నేర్చుకోవాలి "_
                _*- చాణుక్యుడు*_
     。☆✼★━━━━★✼☆。
🌹 *నేటీ మంచి మాట* 🌼
     ♡━━━━━ - ━━━━♡
" నువ్వు వెళ్లే దారిలో మొరుగుతూ ఉన్న కుక్కలన్నిటినీ నోరు మూయించాలనుకుంటే ఎన్నటికీ గమ్యాన్ని చేరలేవు. "

@    Class & Subject wise Study Material :

    #    6th Class    #    7th Class    #    8th Class    #    9th Class    #    10th Class