Moral Story : 65

 *నీతి కథలు - 65*

*వాక్శుద్ధి*

    హరి, గిరి అనేవాళ్ళు, ఇరుగు పొరుగు ఇళ్ళల్లో వుంటున్న …యువకులు. ఇద్దరికీ ఉద్యోగాల్లేవు. అయితే, ప్రవర్తనలో మాత్రం ఇద్దరికీ, ఏనుగుకూ, దోమకూ వున్నంత తేడా! హరి ఇంట్లో తల్లికీ, ఇంటి బయటి పనులకు తండ్రికీ అడగకుండానే వీలైనంత సాయం చేస్తూంటాడు. ఊళ్ళోని పెద్దలకు మర్యాద ఇస్తాడు. తన ఈడు వారితో ఎంతో స్నేహంగావుంటాడు. అందరూ హరిని మెచ్చుకుంటారు. తమ పిల్లలకు హరిలా వుండాలని తరచూ చెబుతూంటారు.

    గిరి ప్రవర్తన హరికి పూర్తిగా భిన్నం. అతడు అడిగినా ఎవరికీ ఏ సాయమూ చే…యడు. ఎక్కువ సేపు నిద్రపోతూంటాడు. పెద్దలను గౌరవించడు. పెద్దా చిన్నా అని లేకుండా అందరితోనూ గొడవ పెట్టుకుంటాడు. అందరూ గిరిని తిట్టుకుంటారు. తమ పిల్లలకు గిరిలా వుండకూడదని చెబుతూంటారు. తనకు చెడ్డ పేరు వచ్చిందని గిరికి తెలుసు. అయితే అందుక్కారణం తన ప్రవర్తన అని అతడనుకోడు. హరి కారణంగానే తనకు చెడ్డ పేరు వచ్చిందని అందరితో అంటాడు. ఉత్త పుణ్యాన హరిని అవకాశం దొరికినపుడల్లా శాపనార్థాలు పెడతాడు.

    ఇదంతా హరికి తెలుసు. అయినా అతడికి గిరిపట్ల కోపంలేదు. ఎవరైనా గిరి చెడ్డవాడని అంటే, ‘‘అందరి ప్రవర్తనా ఒక్కలాగావుండదు. కానీ అంతా గిరిని నాతో పోల్చి చిన్నబుచ్చుతూంటారు. అందుకే అతడికి నామీద కోపం. లేకుంటే మేమిద్దరం మంచి స్నేహితులమే!’’ అనేవాడు. ఇలావుండగా, ఒక రోజున గిరి మేనమామ శంకరయ్య, ఆ ఊరువచ్చాడు. కాసేపు గిరితో మాట్లాడాక, ఆయన, ‘‘బాబూ! నువ్వు చాలా తెలివైనవాడివి. మా ఊరు జమీందారుకు ఇద్దరు చురుకైన కుర్రాళ్ళు కావాలి. ఒకడు పనికీ, మరొకడు కబుర్లకీ. నువ్వేమో జమీందారుకు కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తే, మీ పొరుగింటి హరి పనులు చేసి పెడతాడు. జమీందారు, మీ ఇద్దరూ జంటగా వెళితే తప్పక ఉద్యోగాలిస్తాడు.


 ఆయన ఇచ్చే నెలజీతం కూడా చాలా ఎక్కువే వుంటుంది,’’ అన్నాడు.‘‘నేను ఒక్కణ్ణీ వెళ్ళి అడిగితే, నాకు ఉద్యోగం ఇవ్వడా మీ జమీందారు?’’ అని అడిగాడు గిరి.

    ‘‘ఇవ్వడు! కబుర్లు చెప్పేవాడికి తనతో సమానంగా జీతమిస్తే, పని చేసేవాడికి అసంతృప్తిగా వుంటుంది. అలాగని కబుర్లు చెప్పేవాడికి తక్కువ జీతమిస్తే వాడికి అసంతృప్తి పుట్టి కబుర్లు సరిగా చెప్పలేడు. అందుకని ఆ జమీందారు, ఇందుకు అభ్యంతరం చెప్పని జంట యువకులకే, ఈ ఉద్యోగాలిస్తాడు. మీ హరి చాలా మంచివాడు. మీరు జంటగా వెళితే తప్పక ఈ ఉద్యోగాలు దొరుకుతాయి. వాటిలో మీరు తప్పక రాణిస్తారు,’’ అన్నాడు శంకరయ్య.

    ‘‘నాకు ఉద్యోగం రాకున్నా ఫరవాలేదు కానీ, హరికి మాత్రం రాకూడదు. అందుకే, జమీందారు దగ్గరకు జంటగా వెళ్ళి ఉద్యోగమడగడం, నాకిష్టం లేదు,’’ అన్నాడు గిరి ఆవేశంగా. ‘‘ఆ హరి ఎంతో మంచివాడు. అతడంటే ఎందుకురా నీ కంత కోపం?’’ అని అడిగాడు శంకర…్యు. ‘‘వాడు మాయగాడు. తను మంచివాడినని అందర్నీ ఇట్లే నమ్మిస్తాడు. వాడితో పోల్చి అంతా నన్ను చెడ్డవాడనుకోవాలని వాడి ఉద్దేశ్యం. అందువల్ల, నేను పైకి వచ్చినా రాకున్నా వాణ్ణి మాత్రం పైకిరానివ్వను,’’ అన్నాడు గిరి. శంకరయ్యకు తన మేనల్లుడి ఓర్వలేని గుణం అర్థమైంది. ఆయన ఆ రోజే వెళ్ళి హరిని కలుసుకుని విషయం చెప్పి, ‘‘మీ ఇద్దరికీ ఇది చాలా మంచి అవకాశం. నువ్వు ఎలాగో గిరికి నచ్చజెప్పే ప్రయత్నం చేయి,’’ అన్నాడు.


    ఇందుకు హరి సరేనని, ఆ సాయంత్రం గిరి వద్దకు వెళ్ళాడు. అతడు హరి చెప్పిందంతా శ్రద్ధగా విని, ‘‘ఆ జమీందారు మంచివాడు కాదని, వాళ్ళూ వీళ్ళూ అనుకుంటూండగా విన్నాను. ఆయన మనిద్దరికీ పనియిచ్చినా, తర్వాత కొన్నాళ్ళకు నన్ను పనులు చే…యమంటాడు; నిన్ను కబుర్లు చెప్పమంటాడు. నేను పనులు సరిగ్గా చెయ్యడంలేదనీ, నువ్వు కబుర్లు సరిగ్గా చెప్పడంలేదనీ తిట్టడం మొదలు పెడతాడు. అందుకే ఆ ఉద్యోగాలు వద్దన్నాను,’’ అన్నాడు. ‘‘ఇదంతా నీ ఊహ  అని నాకనిపిస్తున్నది. మరొకసారి బాగా ఆలోచించు,’’ అన్నాడు హరి.


        ఇందుకు గిరి చిరాగ్గా, ‘‘పోనీ, ఊహే  అనుకుందాం. అయినా నాకు వాక్శుద్ధివుంది. నేనేమంటే అది జరుగుతుందని, మా ఇంట్లో అంతా అంటారు. వారం రోజుల క్రితం నాకు జున్ను తినాలనిపించి, ఇంట్లో పాలన్నీ విరిగి పోతే బాగుండునన్నాను. ఆ రోజు పాలు విరిగి పోయాయి. మూడు రోజుల క్రితం పెరట్లో మొక్కలకు నీళ్ళు పొ…య్యమని అమ్మ బలవంత పెడితే, కాసేపట్లో వాన పడుతుందిలే అన్నాను. నిజంగానే వాన పడింది. ఇప్పుడు జమీందారు దుష్టుడు అన్నాను. ఆ మాటా నిజమే అవుతుంది. నా మాట నమ్ము,’’ అన్నాడు.
‘‘నీ ఊహ  నిజమైనా కాకపోయినా, నాకు చాలా మంచి అవకాశం పోయిందని ఎంతో బాధగావుంది,’’ అన్నాడు హరి.

    ‘‘అవకాశం నాకూ పోయిందిగా! అయినా, నామూలంగా నీకు మంచి అవకాశం పోయిందని నువ్వనుకుంటున్నావు. కానీ అది నిజం కాదు. నీకు ఇంతకంటే గొప్ప అవకాశం తొందరలో వస్తుంది. అప్పుడు నీవు ఈ అవకాశం పోయినందుకు ఎంతగానో సంతోషిస్తావు. మరొకసారి చెబుతున్నాను నా మాట నమ్ము. నాకు వాక్శుద్ధివుంది. నా మాట తప్పదు,’’ అని గిరి తన ఉద్దేశ్యం ఖచ్చితంగా చెప్పేశాడు. హరి మంచివాడు కాబట్టి ఇంకేమీ అనలేక తిరిగి వెళ్ళాడు.

     అయితే, ఆశ్చర్యంగా మరి నాలుగు రోజులకు, హరికి దూరపు బంధువు కేశవుల నుంచి కబురొచ్చింది. కేశవులు పట్నంలో వుంటున్నాడు. ఆయన సముద్రయానం చేసి రకరకాల వ్యాపారాల ద్వారా, కూర్చుని తిన్నా తరతరాలు తరగనంత ఆస్తిని సంపాదించాడు. ఆయనకు పిల్లలు లేరు. ఇప్పుడు ముసలివాడై  పట్నంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు.


    తన ఆస్తిని ధర్మకార్యాలకు వినియోగించాలని ఆయన కోరిక. అందుకు సమర్థుడు, మంచివాడు అయిన యువకుడు కావలసివస్తే, ఎవరో ఆ…యకు హరి పేరు చెప్పారు. తన ఆస్తిలో నాలుగోవంతు హరికిచ్చి, తను అతడి వద్దనే వుంటూ, మిగతా ఆస్తిని ధర్మకార్యాలకు వినియోగించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరిక మేరకు హరి పట్నం వెళ్ళి ఆయన్ను కలుసుకున్నాడు. ఆయనకు హరి నచ్చాడు. తర్వాత హరి తన ఊరువచ్చి, తనీస్థితికి చేరుకునేందుకు సాయపడిన వారందరికీ పేరుపేరునా కానుకలిచ్చాడు. వారిలో తలిదండ్రులు, అన్నదమ్ములు, గురువులు, మిత్రులు వున్నారు కానీ గిరి లేడు.


    గిరి అతణ్ణి కలుసుకుని, ‘‘నా వాక్శుద్ధి వల్లనే నీకీ ఉన్నత స్థితి కలిగింది. ఎంతో మంచివాడివని పేరు పొందిన నువ్వు, నా విషయం మరిచిపోవడం విచిత్రంగా వుంది,’’ అన్నాడు.
ఇది వింటూనే హరి చీదరింపుగా, ‘‘నాకు ఉద్యోగం రాకూడదని, నీ ఉద్యోగావకాశాన్ని కూడా వదులుకున్న దుష్టుడివి.     నీకు నిజంగా వాక్శుద్ధివుంటే, నాకు మేలు జరగాలని కోరుకోవు గాక కోరుకోవు. వాక్శుద్ధి వుండాలంటే, మొదట మనసు నిర్మలంగా వుండాలి. అది నీలో లేదు. ఆ పాలు విరగడం, వాన కురవడం-ఒకటి నీ స్వార్థంకోసం, రెండోది పని తప్పించుకునేందుకు అన్నవే. మరొక సంగతి; తాను చెప్పిన చెడుపనులు జరిగినట్టయితే, అలాంటివారిని వాక్శుద్ధికలవారని చెప్పరు, నాలుక పైమచ్చగలవారని అంటారు!’’ అని హరి ఆగాడు.

    గిరి వచ్చేకోపాన్ని బలవంతంగా ఆపుకుంటూ, ‘‘ఆగావేం? ఇంకేమైనావుంటే చెప్పు,’’ అన్నాడు. హరి అతడి ముఖంకేసి ఒకసారి పరీక్షగా చూసి, ‘‘చెప్పడానికి చాలావుంది. ప్రస్తుతానికి కానుకల సంగతి. నీకు కానుకలిస్తే, అర్హత లేని వారిని సన్మానించినట్లే! అది నేను సన్మానించిన మిగతా వారికి చిన్నతనం. కాబట్టి నేను నీకోసం ఏ కానుకా తేలేదు,’’ అన్నాడు. ఈ జవాబుతో గిరి మారుమాట్లాడక తలవంచుకుని అక్కణ్ణించి మౌనంగా వెళ్ళిపోయాడు.
         
          ◦•●◉✿ - ✿◉●•◦
🌻 *మహానీయుని మాట*🍁
    ◈ ━━━ ⸙ - ⸙ ━━━ ◈
_" ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు హృదయంలో ఉంటుంది "_
              _*- మహాత్మాగాంధీ*_
     。☆✼★━━━━★✼☆。
🌹 *నేటీ మంచి మాట* 🌼
     ♡━━━━━ - ━━━━♡
_" ప్రయత్నించనిదే ఫలితం లభించదు. సింహమైనా పడుకుని ఉంటే ఆహారం వచ్చి నోట్లో పడదు "