Moral Story : 08


 నీతి కథలు -08

శ్రమఫలితం!

    ఆరోజు పిల్లలందరూ రాత్రి భోజనాలు పెందలాడే ముగించి, ‘‘కథ చెప్పు, బామ్మా!" అంటూ, సావిత్రమ్మ బామ్మ చుట్టూ చేరారు. ఆమె అందరి కేసీ ఆప్యాయంగా ఓమారు చూసి, కథ చెప్పడం ప్రారంభించింది: పూర్వం కొండపల్లి అనే గ్రామంలో, రంగయ్య అనే రైతువుండేవాడు. రంగయ్యకు నాలుగెకరాల భూమి వుంది గాని, అందులో రెండెకరాలు బీడే, నిండారాళ్ళమయం.

    అతడికి ఇద్దరు కొడుకులు. వాళ్ళు చేతికి అందివస్తున్న వేళకు, అతడి భార్యకన్ను మూసింది. రంగయ్య పెద్ద కొడుకు వీరయ్య మహా బద్ధకస్తుడు. తండ్రి ఎంత చెప్పినా చెవిని పెట్టకుండా, వేళకు భోంచేసి, ఇరుగూ పొరుగూతో ఉబుసు పోని కబుర్లాడేవాడు. చిన్న కొడుకు మల్లయ్య మంచి పనిమంతుడు, కష్టజీవి. ఇలావుండగా - రంగయ్యకు హఠాత్తుగా ఏదో జబ్బు చేసి మంచాన పడ్డాడు. ఒకనాడు చిన్న కొడుకు మల్లయ్యను చేరబిలిచి, కళ్ళ నీళ్ళుపెట్టుకుంటూ, ‘‘నాయనా! నేనింకా ఆట్టే రోజులు బతికేలా లేను.

    నీ గురించి బెంగలేదు గాని, నీ అన్న గురించే భయంగా వుంది. నా కోరిక ఒకటి తీర్చగలవా?" అన్నాడు. ‘‘చెప్పు, నాన్నా! నువ్వేం చెప్పినా కాదనను," అన్నాడు మల్లయ్య. రంగయ్య, ‘‘ఒరే, మల్ల! నువ్వు శ్రమజీవివి. శ్రమ చేసే వాడికి దేవుడు ఎప్పుడూ సహాయపడతాడు. అంచేత నువ్వు మనపొలంలో బీడుగావున్న రెండెకరాలూ తీసుకో.

ఆ పొలం నీచేతికింద మరిరెండేళ్ళు నలిగిందంటే బంగారం పండుతుంది. మంచి భూమి రెండెకరాలూ, నీ అన్నకియ్యి. నీకు వీలైనంతవరకూ వాడికి సాయం చేస్తూ వుండు. ఇదే నా కోరిక!" అని చెప్పి కన్నుమూశాడు. ఆ తర్వాత మల్లయ్య, తండ్రి కోరినట్టే మంచి భూమి అన్నకిచ్చి, ఇల్లు కూడా అన్న పరంచేసి, తను బీడుపొలంలోనే ఒక వారగా చిన్న పాక వేసుకునివుంటూ అహోరాత్రాలు కష్టపడటం ప్రారంభించాడు.

మల్లయ్య బీడుపొలాన్ని ఆనుకుని, ఒక పెద్ద ఉసిరిచెట్టు వున్నది. ఆ చెట్టు మీద వుంటున్న ఒక దేవత, రాళ్ళమయంగావున్న బీడులో మల్లయ్య గొడ్డుచాకిరీ చెయ్యటం చూసి జాలి పడింది. అతడి శ్రమ రెండింతలుగా ఫలించాలని దీవించింది. మల్లయ్య ప్రతి అంగుళమూ చక్కగా దున్ని విత్తులు విత్తాడు. ప్రతి విత్తనమూ మొలకై పైరు ఏపుగా ఎదిగి పచ్చగా కళకళ్ళాడ సాగింది.

మల్లయ్య పని ఇలా వుండగా, అన్న వీరయ్య తన పొలం చేయడానికి పనివాళ్ళను పెట్టి, సోమరిగా ఊళ్ళో కబుర్లాడుతూ కాలక్షేపం చేయసాగాడు. అందువల్ల, వీరయ్య పొలం, మల్లయ్య పొలం ముందు తీసికట్టయింది. వీరయ్య ఒకనాడు మల్లయ్య పొలం వైపు వెళ్ళాడు. నిండుగా కళకళ్ళాడి పోతున్న తమ్ముడి పొలం చూసే సరికి, అతడికళ్ళు పచ్చబడ్డాయి.

వెంటనే మల్లయ్యను పిలిచి లేని ఆప్యాయత నటిస్తూ, ‘‘తమ్ముడూ! నాన్న నీకు బీడుభూమి ఇచ్చి అన్యాయం చేశాడు. నేను హాయిగా సుఖపడుతూంటే నువ్వు రెక్కలు ముక్కలు చేసుకోవలసి వస్తున్నది. మనం ఈ క్షణానే మార్చుకుందాం!" అన్నాడు. మల్లయ్యకు, అన్న దురుద్దేశ్యం అర్థమైంది. అయినా, అతడు తండ్రి తుది కోరిక గుర్తు తెచ్చుకుని, పంటతో నిండుగావున్న తన పొలాన్ని అన్నకు స్వాధీనం చేశాడు.

మల్లయ్యకు జరిగిన అన్యాయం గురించి ఊరి పెద్ద భూషయ్యకు తెలిసి మండిపడ్డాడు. ఆయన వీరయ్యను నిలుచున్న పళంగారప్పించి, ‘‘వీరయ్యా! నీ తమ్ముడి మంచితనాన్ని అలుసుగా తీసుకుని, అతణ్ణి నువ్విలా అన్యాయం చేయటం ఏమీ బాగులేదు. మరొకసారి నువ్వతడి పొలం జోలికి వెళ్ళావంటే, నిన్ను కఠినంగా శిక్షస్తాను!'' అంటూ కటువుగా హెచ్చరించాడు.

ఆ తర్వాత తనే స్వయంగా మల్లయ్య పాకకు వెళ్ళిన భూషయ్య, ‘‘నాయనా, బాగున్నావా?" అంటూ పలకరించి, తన పాలేరు చేత మోయించుకు వచ్చిన బియ్యపు మూటను పాకలో పెట్టించి, ‘‘మల్లయ్యా! నీకేదో ఉత్తి పుణ్యాన దానం చేస్తున్నాననుకోకు. మా ఒక్కగానొక్క బిడ్డ చంద్రమ్మను, నీకిచ్చి చేయాలన్నది మాకోరిక.

చంద్రమ్మ కూడా నువ్వంటే ఇష్టపడుతున్నది. నా కూతుర్ని పెళ్ళాడి, నా ఇల్లే నీ ఇల్లనుకుని వచ్చి వుండు," అన్నాడు. భూషయ్య ఆదరణకు మల్లయ్య కళ్ళు చెమర్చాయి. అతడు వినయంగా, ‘‘అయ్యా, మీ అమ్మాయిని పెళ్ళాడేందుకు, నాకెలాంటి అభ్యంతరమూ లేదు.

అయితే, ప్రస్తుతం ఆమెకు ఒక మంచిచీర కొనడానికి కూడా వీల్లేని దశలో వున్నాను. ఈ ఏడంతా కష్టపడి నాలుగు రూకలు కూడగట్టుకోనివ్వండి. పైఏడు చిన్నదో చితకదో నగ పెట్టి మరీ ఆమెను పెళ్ళాడతాను," అన్నాడు. మల్లయ్య ఆత్మాభిమానానికి సంతోషించిన భూషయ్య, మరేమీ మాట్లాడకుండా తిరిగి వెళ్ళాడు. దేవత కూడా మల్లయ్య బుద్ధి కుశలతకు చాలా ఆనందించింది.

ఆమర్నాడే తన పొలంలో మామిడి మొక్కనాటేందుకు గుంట తవ్వుతున్న మల్లయ్యకు, నిండుగా బంగారు కాసులున్న చిన్న రాగి బిందె దొరికింది. అతడు వెంటనే దాన్ని తీసుకువెళ్ళి భూషయ్యకిస్తూ, జరిగింది చెప్పాడు. అంతా విన్న భూషయ్య పరమానంద పడుతూ, ‘‘నాయనా! ఇది ఏ వనదేవతో, నీ శ్రమకు మెచ్చియిచ్చిన బహుమతే! ఇప్పుడు నువ్వు నాకంటే ధనికుడివి.

ఇక నా కుమార్తెతో, నీ వివాహానికి ముహూర్తం పెట్టిస్తాను, సరా!" అంటూ ప్రశ్నించాడు. మల్లయ్య, గ్రామపెద్ద మాటలకు ఆనందిస్తూ, తన అంగీకారాన్ని తెలిపాడు. జరిగినదంతా ఆనోటా ఈనోటా విన్న వీరయ్య రెండు రోజుల పాటు పశ్చాత్తాప పడి, తమ్ముణ్ణి కలుసుకుని, ‘‘తమ్ముడూ, శ్రమఫలితం ఎలా వుంటుందో, నాకిప్పటికి తెలిసి వచ్చింది. నీ శ్రమను దోచుకుని నేను చాలా పాపం చేశాను.

నా రెండెకరాలు కూడా నువ్వే తీసుకో. నన్ను నీ దగ్గర పనివాడుగా పెట్టుకుని, సోమరిగా ఇబ్బందుల పాలవడంకాక, తగిన శ్రమ చేస్తూ సుఖంగా బతకటం నేర్పు, చాలు!" అన్నాడు. మల్లయ్య అమాంతం అన్నను కౌగలించుకుంటూ, ‘‘అన్నయ్యా! ఇద్దరం కలిసి పొలంలో శ్రమ చేద్దాం. నాదీ నీదీ అన్నభేదం లేకుండా కలిసికట్టుగా బతుకుదాం,'' అన్నాడు. వీరయ్య, తమ్ముడు చెప్పిందానికి ఆనందంగా అంగీకరించాడు.

కథ ముగించిన బామ్మ, ‘‘పిల్లలూ! వీరయ్యకులాగే మీకూ శ్రమఫలితం ఎంత ఆనందాన్నిస్తుంతో తెలిసి వచ్చిందా? శ్రమ అంటే చేసేదాని పట్ల శ్రద్ధ అన్న మాట!" అన్నది నవ్వుతూ. పిల్లలంతా ఆనందంగా, ‘‘ఓ, బాగా తెలిసింది, బామ్మా! మేం ఇంకా శ్రద్ధగా చదువుకోవాలన్న మాట," అన్నారు.