Moral Story : 83

 

*నీతి కథలు - 83*

*బంగారు బాతుగుడ్లు*

ఒక నగరంలో రాముడు అనే పేద యువకుడు ఉండేవాడు. వాడికి నా అన్న వారెవరూ లేరు. వాడికి ఉన్నదల్లా ఒక కొంపా, ఒక కోడి పెట్టా. రాముడు పగలల్లా నగరంలో కూలి పనులు చేసి, ఆ డబ్బుతో తన పొట్ట నింపుకునేవాడు. ఒక్కరోజు సంపాదన దొరక్కపోతే తన కోడి పెట్టిన గుడ్లు ఉడకేసుకు తిని, మంచినీళ్ళు తాగి, తృప్తిగా పడుకునేవాడు. రాముడి ఇంటి పొరుగున గవరయ్య అనే వాడు ఉండేవాడు.
 
గవరయ్య దురాశాపరుడే గాక; ఒకరు పచ్చగా ఉంటే చూసి ఓర్చలేనివాడు. రాముడు చిల్లిగవ్వ చెయ్యక పోయినా, ఉన్నది తిని నిశ్చింతగా తిరుగుతూ ఉండటం గవరయ్యకు కడుపు మంటగా ఉండేది. బాగా బలిసి, కొవ్వుపట్టి ఉన్న రాముడి కోడిపెట్టను చూసి కూడా గవరయ్య అసూయపడేవాడు. ఒకనాడు రాముడు ఇంటిలో లేని సమయంలో గవరయ్య ఆ కోడిని పట్టి, కోసి వండుకుని తినేశాడు. రాముడు ఇంటికి వచ్చి చూసేసరికి కోడిపెట్ట లేదు. దాని ఈకలూ అవీ పొరుగు వాడి ఆవరణలో కనిపించాయి.
 
రాముడు గవరయ్య వద్దకు వెళ్ళి, ‘‘నా కోడిని ఏమి చేశావు?'' అని అడిగాడు. ‘‘మా పిల్లి ఎక్కడి నుంచో ఒక కోడిని తెచ్చి, తినబోయింది. నేను ఆ కోడిని కాపాడదామనుకున్నాను. ఆ కోడి చావనే చచ్చింది. ఇక చేసేదిలేక వండుకు తిన్నాను. ఆ కోడి నీదేనని నాకేం తెలుసు?'' అన్నాడు గవరయ్య. రాముడు మండిపడి, ‘‘మర్యాదగా నా కోడిని నాకిస్తావా? రాజుగారి దగ్గిర ఫిర్యాదు చెయ్యమన్నావా?'' అని గవరయ్యను అడిగాడు.

గవరయ్య భయపడ్డాడు. ఎందుకంటే, రాజు న్యాయం చెయ్యటంలో దయూదాక్షిణ్యాలు చూపేవాడు కాడు. గవరయ్యకు జరిమానా గాని, ఖైదుశిక్ష గాని పడి తీరుతుంది. ఏదో విధంగా రాముడితో రాజీ పడటమే మంచిదని గవరయ్య, రాముడికి ఒక బాతుపిల్లను ఇస్తూ, ‘‘నీ కోడికి బదులుగా దీన్ని పట్టుకుపో,'' అన్నాడు. బంగారం లాంటి కోడి పోయినా, బాతు పిల్ల అయినా దొరికినందుకు రాముడు ఊరటపడ్డాడు.
 
కొంత కాలానికి బాతుపిల్ల పెరిగి గుడ్లు పెట్టసాగింది. ఇంతలో వర్షాకాలం వచ్చింది. ఒకనాటి రాత్రి వర్షం జోరున కురుస్తూండగా ఒక ఫకీరు వచ్చి, గవరయ్య ఇంటి తలుపు తట్టాడు. ‘‘ఎవరదీ? వేళాపాళా లేదూ? ఈ వర్షంలో నీకు తలుపెవరు తీస్తారు? వెళ్ళు, వెళ్ళు,'' అని ఫకీరుతో అని, గవరయ్య ముసుగుతన్ని పడుకున్నాడు. ఫకీరు వచ్చి రాముడి ఇంటి తలుపు తట్టాడు.
 
రాముడు తలుపు తెరిచి, తడిసి పోయి చలికి వణుకుతున్న ఫకీరును చూసి, లోపలికి రమ్మని, అతడికి పొడిబట్టలిచ్చి, చలి కాచుకోవటానికి చితుకులమంట వేశాడు. ఆ మంట మీదనే రెండు బాతుగుడ్లు ఉడకబెట్టి, రాముడు ఫకీరుకు తినమని ఇచ్చాడు. ‘‘బాతుగుడ్లు చాలా రుచిగా ఉన్నాయి. నాయనా! ఏదీ నీ బాతు?'' అని ఫకీరు రాముణ్ణి అడిగాడు. రాముడు గంప కింది నుంచి బాతును తెచ్చి ఫకీరుకు చూపాడు.

‘‘దేవుడు నీకు మేలుచేస్తాడు, నాయనా!'' అంటూ ఫకీరు బాతును నిమిరి, వర్షం తగ్గిపోవటం చేత, ఆ చీకట్లోనే వెళ్ళిపోయూడు. ఆ మర్నాటి నుంచీ ఆ బాతు మామూలు గుడ్లకు బదులు బంగారుగుడ్లు పెట్టసాగింది. దానితో రాముడి దరిద్రం తీరిపోయింది. వాడు కూలికి వెళ్ళటం మానుకుని, బాతు పెట్టే బంగారంతో తాను తిని, మిగిలినది దానధర్మాలు చేయసాగాడు. కాని వాడా పూరికొంపను మాత్రం విడిచిపెట్టలేదు. గవరయ్యకు రాముడి జీవితంలో ఏదో మార్పు కలిగినట్టు తెలిసింది, కాని అది ఎలా కలిగినదీ తెలియలేదు.
 
అతను రాముడి మీద ఒక కన్నువేసి ఉంచాడు. ఒకరోజు రాముడు బాతు ఉండే గంపకింది నుంచి ఒక బంగారు గుడ్డు తియ్యటం గవరయ్య కంటపడింది. వెంటనే గవరయ్య గుండె అసూయతో అవిసిపోయింది. అది తన బాతే అయి ఉండటంచేత గవరయ్య కడుపుమంట మరింత అయింది. ‘‘నా బాతును నాకిచ్చెయ్యి,'' అంటే రాముడు ఇవ్వడు. అందుచేత, గవరయ్య తన నౌకర్లను ఇద్దరిని వెంటబెట్టుకుని రాజుగారి దర్బారుకు వెళ్ళి, ఆయన న్యాయవిచారణ జరిపే సమయంలో, ‘‘మహారాజా, నా పొరుగున ఉన్న రాముడనేవాడు నా బాతులను చాలా కాలంగా కాజేస్తున్నాడు.
 
అవి ఒకటొకటే పోతుంటే ఏ గండుపిల్లో కాజేస్తున్నదనుకున్నాను. కాని నిన్న రాత్రి రాముడు నా బాతును కాజేస్తూ ఉండగా ఈ మనుషులిద్దరూ చూశారు. ఏలినవారు నా బాతును తిరిగి ఇప్పించాలి,'' అన్నాడు. రాజుగారు తన భటులను పంపి, రాముణ్ణి బాతుతో సహా దర్బారుకు పిలిపించాడు. ‘‘నువ్వు నిన్నరాత్రి ఇతని బాతును దొంగిలించావట, నిజమేనా?'' అని రాజు రాముణ్ణి అడిగాడు.
 
గవరయ్యకు బాతు రహస్యం తెలిసిపోయిందని రాముడికి అర్థమయింది. ‘‘మహారాజా, నేను దొంగతనం చెయ్య లేదు. ఇది ఇతని బాతే, కాని కొంతకాలం క్రితం నా కోడిని కాజేసి, చంపి తిని, దానికి బదులుగా నాకీ బాతును ఇచ్చాడు,'' అన్నాడు రాముడు.

‘‘అబద్ధం! నిన్న ఈ మనిషి దొంగతనం చేస్తూండగా చూసిన ఈ ఇద్దరు సాక్షులూ ఉన్నారు. వాడు చెప్పేదానికి సాక్షులెవరు?'' అన్నాడు గవరయ్య. రాజుగారు, ‘‘ఈ బాతును ప్రస్తుతానికి నా వద్ద ఉంచి, రేపు మీరిద్దరూ రండి, తీర్పు చెబుతాను,'' అని గవరయ్యనూ, రాముణ్ణీ పంపేశాడు. ఆ రోజు కూడా ఆ బాతు రాజుగారి దగ్గిర బంగారు గుడ్డు పెట్టింది. రాజుగారు తన కళ్ళను తానే నమ్మలేకపోయూడు.
 
ఈ రహస్యం ఫిర్యాదీలకు తెలిసే ఉండాలి. వారినుంచే నిజం రాబట్టదలిచాడు రాజు. మర్నాడు రాజుగారి దర్బారుకు గవరయ్యూ, రాముడూ వచ్చారు. రాజుగారు గవరయ్యకు ఒక మామూలు బాతుగుడ్డు చూపుతూ, ‘‘నీ బాతు ఈ ప్రమాణం గల గుడ్లు పెడుతుందా?'' అని అడిగాడు. ‘‘ఇంతకన్న ఇంకాస్త పెద్ద గుడ్లే పెడుతుంది, మహారాజా!'' అన్నాడు గవరయ్య. రాజు అదే ప్రశ్న రాముణ్ణి అడిగాడు. ‘‘అది మామూలు గుడ్లు పెట్టదు, మహారాజా.
 
నా బాతు రోజుకొక బంగారు గుడ్డు పెడుతుంది,'' అన్నాడు రాముడు. గవరయ్య తెలివిగా, ‘‘ఎంత అబద్ధం! బాతు ఎక్కడన్నా బంగారు గుడ్లు పెడుతుందా?'' అన్నాడు. ‘‘నీ మాట నిజం! అది నీ బాతే. దాన్ని నువ్వు తీసుకువెళ్ళు,'' అని రాజు గవరయ్యకు మామూలు బాతు నొకదాన్ని ఇచ్చి పంపేశాడు. తనకు న్యాయం జరగనందుకు విచారిస్తూ నిలబడిన రాముడితో రాజు, ‘‘దిగులు పడకు. నీ బాతు నా వద్దనే ఉన్నది. అది బంగారు గుడ్లు పెట్టటానికి కారణం ఏమిటి?'' అన్నాడు.
 
రాముడు ఫకీరు సంగతి అంతా రాజుకు చెప్పాడు. రాజు ఆశ్చర్యపడి, రాముణ్ణి బాతుతో సహా తన దివాణంలోనే ఉండి పొమ్మన్నాడు. గవరయ్య తీసుకుపోయిన బాతు మామూలు గుడ్లే పెట్టింది. రాముడికి దివాణంలో ఉద్యోగమయిందని తెలియగానే, తనకు తగిన శాస్తి జరిగిందనుకున్నాడు గవరయ్య.
            
          ◦•●◉✿ - ✿◉●•◦
🌻 *మహానీయుని మాట*🍁
    ◈ ━━━ ⸙ - ⸙ ━━━ ◈
_" భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేము, వివేకంతో చేసే పని సత్ఫలితాన్నిస్తుంది "_
         _*- స్వామి వివేకానంద*_
     。☆✼★━━━━★✼☆。
🌹 *నేటీ మంచి మాట* 🌼
     ♡━━━━━ - ━━━━♡
_" ప్రతి చిన్న అవాంతరానికీ సంకల్పాన్ని మార్చుకునేవారు లక్షానికి దూరమవుతారు. అంతరాయాలు కలిగేకొద్దీ సంకల్పాన్ని దృఢతరం చేసుకుంటూ పోవాలి. "_