Moral Story : 80* నీతి కథలు - 80 *
 శేషయ్య చెంపదెబ్బ

శేషయ్య పేదవాడైనా ప్రతిఫలం ఆశించకుండా పరోపకారం చేస్తూంటాడు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని పొట్టపోషించుకునే శేషయ్య, ఇతరులకు తన అవసరముంటే తీరిక చేసుకుని మరీ సాయపడేవాడు.

శేషయ్య పేదరికం చూసి జాలిపడే ఊరి పురోహితుడు, అప్పుడప్పుడూ వాడికి, ‘‘ఒరే, అడగనిదే అమ్మయినా పెట్టదంటారు! ఇతరులకు నువ్వు సాయపడినప్పుడు ఎంతో కొంత ప్రతిఫలం అడిగి తీసుకోవడం అలవాటు చేసుకో,'' అని సలహా ఇస్తూండేవాడు.

‘‘ప్రతిఫలం అడిగితే చేసింది సాయమెలా అవుతుంది. నేను పనికి మాత్రమే ప్రతిఫలం తీసుకుంటాను; సాయానికి తీసుకోను. నా సాయం గుర్తుంచుని, నాకు అవసరమైనప్పుడు ఎవరో ఒకరు నాకూ సాయపడతారని, నా ఆశ!'' అని ఊరుకునేవాడు శేషయ్య.

ఆ ఊళ్ళో రంగనాధుడనే భాగ్యవంతుడున్నాడు. కోట్లకు పడగలెత్తినా, ఆయన మహాపిసినారి. ఆయనకు శేషయ్య విషయం తెలిసింది. అలాంటివాడి చేత ఖర్చులేకుండా పని చేయించుకోవచ్చునని తోచిందాయనకు. క్రమంగా ప్రతిరోజూ ఆయనవాడి చేత ఏదో ఒకపని చేయించుకునేవాడు.

రంగనాధుడి తల్లి నిత్యరోగి. రోజూ వైద్యుడింటికి వెళ్ళి ఆమె పరిస్థితి చెప్పి, వైద్యుడిచ్చే మందులు తీసుకురావాలి. మరెవరైనా అయితే డబ్బు తీసుకోకుండా ఆపని చెయ్యరు.

రంగనాధుడు, శేషయ్యకు ఆపని అప్పజెప్పాడు. రంగనాధుడికి పలురకాల వ్యాపారాలున్నాయి. వివిధ వస్తువుల ధరలు తెలుసుకునేందుకు ఆయన, వారంవారం ఆ ఊళ్ళో జరిగే సంతలో ధరవరలు వాకబు చేయిస్తూంటాడు. శేషయ్య చేత ఆయన ఆపని కూడా చేయించసాగాడు. అంతేకాక, ఇంట్లో వాళ్ళు వాడిచేత పెరట్లో అరిటాకులు కోయడానికీ, ఎవరింటికైనా కబురు పంపడానికీ వాణ్ణి ఉపయోగించుకునేవాళ్ళు.

ఇలావుండగా, శేషయ్య కూతురుకు పెళ్ళికుదిరింది. పెళ్ళి ఖర్చులకు తన వద్దవున్నది చాలక వాడు నలుగుర్ని సాయమడిగాడు. కానీ, ఫలితం లేకపోయింది. అప్పుడు ఊరి పురోహితుడు వాడితో, ‘‘నీకు సాయపడగల సత్తా మన ఊళ్ళో రంగనాధుడికొక్కడికే వుంది. పైగా ఆయన నీచేత బోలెడు పనులు చేయించుకుంటున్నాడు. ఆయన్నడుగు!'' అని చెప్పాడు.

శేషయ్య ఆసాయంత్రమే రంగనాధుడి వద్దకు వెళ్ళి, ‘‘దండాలు బాబూ! తమరిసాయంకోరి వచ్చాను,'' అన్నాడు.

ఆ సమయంలో ఏవో ఖాతా పుస్తకాలు చూసుకుంటున్న రంగనాధుడు, సాయం అన్నమాట వింటూనే చప్పున తలపైకెత్తి, ‘‘సాయమా! ఎవరు నువ్వు?'' అన్నాడు.

‘‘అదేంటి, బాబూ! తమరు రోజూ నన్ను చూస్తూనే ఉంటారుగదా,'' అంటూ శేషయ్య తను రోజూ చేసే సేవల వివరాలు చెప్పాడు.

‘‘ఏమో, ప్రతిరోజూ నేను బోలెడు మందిని చూస్తూంటాను. నువ్వు మా అమ్మకు మందులు తెచ్చియిస్తున్నావంటున్నావు గదా, ఆవిడ నిన్ను గుర్తుపడుతుందేమో చూద్దాం,'' అంటూ రంగనాధుడు, శేషయ్యను తల్లివద్దకు తీసుకువెళ్ళాడు. ఆవిడ శేషయ్య ఎగాదిగా చూసి, ‘‘ఇతగాణ్ణి చూసినట్లే అనిపిస్తున్నది. ఒక రోజున మందులు తేవడం ససేమిరా తనవల్లకాదన్నాడు. ఆ రోజు మందులు తెప్పించుకునేందుకు మనిషి దొరక్క చాలా ఇబ్బంది పడి, వీణ్ణి నానా తిట్లూ తిట్టుకున్నాను,'' అన్నది.

‘‘చూశావా! ఈ విడకు నువ్వు సాయంచేశావో లేదో కానీ, ఇబ్బంది మాత్రం కలిగించావు,'' అన్నాడు రంగనాధుడు. ఈ జరిగినదానికి శేషయ్య దిగులు పడిపోయి, ఇంటికి బయల్దేరాడు. దారిలో పురోహితుడు ఎదురుపడి, వాడి వాలకం చూసి, ‘‘ఏం జరిగిందేమిటి?'' అని అడిగాడు.

శేషయ్య, ఆయనకు జరిగింది చెప్పాడు విచారంగా.

పురోహితుడు కొంచెంసేపు ఆలోచించి, ‘‘ఒరే, నీకు పనిపాటుల్లో సాయపడడంలో నేర్పు తప్ప, ఇతరత్రా భయస్థుడివనీ, అమాయకుడివనీ, ఆ రంగనాధుడు అనుకుంటున్నాడు. నువ్వు ఆయన భార్యవాళ్ళ క్కూడా సాయపడుతూ ఉండేవాడివిగదా, వెళ్ళి ఆవిడ నిన్ను గుర్తు పట్టగలదేమో చూడు.

ఆవిడా నిన్ను గుర్తు పట్టకపోతే, నీలో కొద్దిపాటి చేవా, కాస్తంత సాహసం కూడా వున్నదని, ఆ రంగనాధుడికి తెలియపరుచు! '' అని చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.

పురోహితుడి మాటలు శేషయ్యలో కొంత ధైర్యం కలిగించాయి. వాడు ఈసారి రంగనాధుడి ఇంటికి వెళ్ళేసరికి, ఆయన ఇంటివసారాలో భార్యతో మాట్లాడుతూ కనిపించాడు. శేషయ్య ఏదో తెగించిన వాడిలా కాస్త పెద్ద గొంతుతో, ‘‘బాబూ! నేను ఈమెగారి క్కూడా చాలాసార్లు సాయంచేశాను, అడిగి చూడండి!'' అన్నాడు.

రంగనాధుడు కోపంగా ఒకసారి శేషయ్య కేసి చూసి భార్యను, ‘‘ఇతగాణ్ణి నీ వెప్పుడైనా చూశావా?'' అని అడిగాడు.

‘‘ఏదో చూసినట్లే అనిపిస్తున్నది. ఒకసారి పెరట్లో అరిటాకులు కోయమంటే పదాకులు కోశాడు. ఇంకో పది కావాలంటే పెరట్లో మరిలేవన్నాడు. ఆ పది ఆకులు సేకరించడం కోసం నానా అవస్థలూ పడుతూ వీణ్ణి తెగ తిట్టుకున్నాను,'' అన్నది రంగనాధుడి భార్య.

‘‘బాబూ! నాపొట్ట కోసం రెక్కలు ముక్కలు చేసుకునే నేను, వీలు దొరికినప్పుడెల్లా మీకూ, మీ ఇంట్లోవారికీ ఎన్నో పనుల్లో సాయపడ్డాను,'' అన్నాడు శేషయ్య కటువుగా.

ఆ మాటలకు రంగనాధుడు నవ్వి, ‘‘కలిగినవాళ్ళకు సాయపడడంలో గౌరవముంది. అందుకే నాలాంటి వాళ్ళ పనులు చేసిపెట్టడంకోసం ఎందరో పోటీ పడతారు. మావంటివాళ్ళు నిన్ను గుర్తుంచు కోవాలంటే, నువ్వు చాలాగొప్ప పనేదైనా చెయ్యాలి,'' అన్నాడు.

‘‘చేసినదానికి నన్నెవ్వరూ మెచ్చుకోవాలనుకోలేదు. కానీ చేయనందుకు మాత్రం నన్ను బాగా తిట్టుకున్నారు. అందుకు నాకు బాధగావుంది,'' అన్నాడు శేషయ్య.

‘‘అందుకే, కడివెడు పాలను విరవడానికి, ఒక్క ఉప్పురాయి చాలంటారు,'' అన్నాడు రంగనాధుడు.

‘‘పోనీలెండి బాబూ! అదంతా ఎందుకుగానీ, నా కూతురు పెళ్ళికి డబ్బుకావాలి. పెద్ద మనసు చేసుకుని నాకు డబ్బిచ్చి ఆదుకోండి. మీ మేలు జన్మజన్మలకూ మర్చిపోను,'' అన్నాడు శేషయ్య వేడుకుంటూ.

రంగనాధుడు చిరాగ్గా, ‘‘నేను తప్పక సాయం చేసి వుండేవాణ్ణి. ఈమాట ముందే చెప్పాను-నువ్వెవరివో నాకు తెలియదేమరి!'' అన్నాడు. ఈ జవాబుతో శేషయ్య విసిగిపోయి వెళ్ళిపోతూ, రంగనాధుణ్ణి సాచి చెంపదెబ్బ కొట్టాడు.

అనుకోకుండా జరిగిన దీనికి రంగనాధుడు నివ్వెరపోయి చూస్తూండగా, శేషయ్య అక్కడినుంచి తప్పుకున్నాడు.

ఆనాటి వరకూ రంగనాధుడు అలాంటి అవమానం ఎరగడు. ఆయన ఉక్రోషం పట్టలేక వెంటనే వెళ్ళి గ్రామాధికారిని కలుసుకుని, ‘‘శేషయ్య అనే పొగరుబోతు నన్ను చెంపమీద కొట్టాడు. వాణ్ణి తగిన విధంగా శిక్షంచకపోతే, ఊళ్ళో క్రమశిక్షణ నశించి అరాచకం తలెత్తుతుంది!'' అంటూ జరిగిందానికి చిలవలూ పలవలూ అల్లి చెప్పాడు.

సంజాయిషీ అడగడానికి గ్రామాధికారి వెంటనే శేషయ్యకు కబురుపెట్టాడు. అయితే కొంతసేపటికి అక్కడికి వచ్చిన పురోహితుడు, ‘‘ఒకవైపు కూతురి పెళ్ళిదిగులూ, మరోవైపు చలిజ్వరంతో శేషయ్య మంచం దిగలేకుండా ఉన్నాడు. జరిగిన సంగతి తమకు మనవి చేయమని నన్ను పంపాడు,'' అన్నాడు.

‘‘ఏం చెప్పాడేమిటి?'' అని అడిగాడు గ్రామాధికారి.

‘‘రంగనాధుడికి జ్ఞాపకశక్తి తక్కువట. పైగా ఆయనకు బోలెడు వ్యాపకాలు. కొందరాయనకు సాయపడు తూంటారు. కొందరాయన మీద చెయ్యి చేసుకుంటారు. అయితే ఎవరూ ఆయనకు గుర్తుండరని చెప్పమన్నాడు,'' అన్నాడు పురోహితుడు.

రంగనాధుడు కోపంతో, ‘‘వాడి పేరు శేషయ్య. వాడి కూతురికి పెళ్ళి కుదిరింది. డబ్బు సాయం కావాలని నా దగ్గరికి వచ్చాడు. ఇవ్వనన్నానని చెంప మీద కొట్టాడు,'' అన్నాడు.

‘‘శేషయ్య ఈయనకూ, ఈయన కుటుంబానికీ జీతం బత్తెం లేకుండా ఎన్నో సేవలు చేశాడు. అయినా వాడు ఈయనకు గుర్తురాలేదు. ఏదైనా గొప్పపని చేస్తేనే తనకు గుర్తుంటుందన్నాడట. వాడు చెంపదెబ్బ కొడితే ఈయనకు బాగా గుర్తుంది. అంటే ఇన్నాళ్ళకు వాడొక గొప్పపని చేశాడన్న మాట. గొప్పపని చేసినవారిని మెచ్చుకోవాలి గానీ సంజాయిషీ అడక్కూడదు గదా!'' అన్నాడు పురోహితుడు గ్రామాధికారిని పరీక్షగా చూస్తూ.

దాంతో గ్రామాధికారికి విషయం అర్థమయింది. అయినా పురోహితుడి మాటలు సమర్థించలేక, ‘‘చమత్కారంగా మాట్లాడినంత మాత్రాన తప్పు తప్పు కాకుండా పోదు. శేషయ్యకు శిక్ష తప్పదు, '' అన్నాడు.

‘‘అయ్యా, శేషయ్య రంగనాధుడికి ఎన్నోసేవలు చేశాడు. ప్రతిఫలం లేదు. వాడి సేవలకు ప్రతిఫలం ఇప్పించలిగినవారికే వాడి తప్పును శిక్షంచే అర్హత ఉంటుందంటే అది తప్పవుతుందా?'' అన్నాడు పురోహితుడు వినయంగా. గ్రామాధికారి చిన్నబుచ్చుకున్నట్లుగా ముఖంపెట్టి, ‘‘శేషయ్య సంగతి నాకు తెలుసు.

గ్రామంలో చాలామందికి సాయపడుతూంటాడు. అలా అతడి సాయపొందిన వారిలో నేనూ వున్నాను. అతడు చేసిన తప్పుకు శిక్ష విధించాలంటే, ముందు చేసిన సాయానికి ప్రతిఫలం ఇవ్వాలి. ఈ ఊరిలో అతడి సాయం పొందిన ప్రతివారూ, అతడికి ప్రతిఫలమిచ్చేలా చూడ్డం, నా బాధ్యత. లేకుంటే, ఊరందర్నీ అతడు చెంపదెబ్బలు కొట్టినా, ఆఖరికి నన్ను కూడా చెంపదెబ్బ కొట్టినా శిక్షంచే అర్హత నాకుండదు,'' అన్నాడు.

ఈ తీర్పు ఊరందరికీ చెంపదెబ్బలా తగిలింది. అందరూ కూడబలుక్కుని, శేషయ్య కూతురు పెళ్ళికి సాయపడాలని నిశ్చయించారు. గ్రామాధికారి పురోహితుడికేసి మెచ్చుకుంటున్నట్టు చూస్తూ, ‘‘నువ్వన్న మాటలు శేషయ్య చెప్పి పంపాడో, లేక నువ్వే అన్నావో తెలియదు. శేషయ్య వచ్చినా ఇలా జరిగి ఉండేది కాదేమో. సమయానికి వచ్చి సమస్యను పరిష్కరించి శేషయ్యకే కాకుండా మొత్తం మీద గ్రామానికే మేలు చేసి నిజంగానే పురోహితుడి వనిపించుకున్నావు,'' అన్నాడు.

వాళ్ళల్లో కొందరు రంగనాధుడు వినేట్టుగానే, ‘‘ఊళ్ళో ఇంత మందిమి వున్నాం. మమ్మల్ని మాట మాత్రంగానైనా అడక్కుండా, ఏరికోరి పిసినారిని అర్థించి, శేషయ్య లేనిపోని గొడవ తెచ్చుకున్నాడు,'' అన్నారు.

నలుగురూ అన్న మాటలతో రంగనాధుడి కళ్ళు తెరుచుకున్నాయి. ఆయన, ‘‘శేషయ్య కొట్టింది నన్ను కాదు, నాలోని మితిమీరిన స్వార్థాన్ని, నా అహంకారాన్ని. వాటికాశిక్ష తగినదే! అందువల్ల శేషయ్య చేసింది తప్పుకాదు. ఇకమీదట మంచితనానికి తగిన ప్రతిఫలం ఇవ్వడమే నా జీవితాశయం చేసుకుని, శేషయ్య వంటి వారిని మంచికి దూరం కాకుండా చూస్తాను,'' అన్నాడు.