Moral Story:75

*నీతి కథలు - 75

*ఫలించిన ఉపాయం*

వద్దిపర్రు అనే గ్రామంలో, రాజయ్య అనే గ్రామాధికారి వద్ద, నందెయ్య అనే గ్రామనౌకరుండేవాడు. వాడు గ్రామాధికారికి నమ్మిన బంటుగా వుంటూ, వృత్తి సంబంధమైన పనులతోపాటు, ఇంటిచాకిరీ కూడా చేస్తూ, రాజయ్య భార్య రంగమ్మ అభిమానాన్ని కూడా సంపాయించాడు. రంగమ్మ వాడితో తరచుగా, ‘‘నీ మూలంగా నాకు ఎంతో సౌఖ్యంగా వుంది. నీకు మంచి సహాయం నావల్లగానీ, నీ యజమానివల్లగానీ ఎప్పుడైనా అవసరపడితే, నీకు మేలుజరిగేలా చూస్తాను,'' అంటూండేది.
 
ఇలావుండగా, జమీందారు దివాణంలో పనిచేయడానికి రెండు ఉద్యోగాలు ఖాళీపడ్డాయి. రాజయ్యకు సమర్థుడైన గ్రామాధికారి అని పేరుండడంవల్ల, ఆ రెండిట్లో ఒక ఉద్యోగానికి ఎవరైనా మంచివాణ్ణి ఎంపిక చేసే అవకాశం జమీందారు, ఆయనకిచ్చాడు.
 
నందెయ్యకు ఈ విషయం తెలియగానే వాడు, రంగమ్మతో, ‘‘నా కొడుక్కు కొద్దిపాటి చదువుంది. మిమ్మల్నే నమ్ముకున్నాను. అయ్యగారితో, వాడికి దివాణంలో ఉద్యోగం వచ్చేలా జమీందారుగారితో ఒక చిన్నమాట చెప్పమనండి,'' అని కోరాడు.
 
రంగమ్మ తప్పక ఉద్యోగం వచ్చేలా చూస్తానని మాటయిచ్చింది. ఆరోజు సాయంత్రం నందెయ్య గ్రామకచేరీ నుంచి రాజయ్యతో కలిసి ఇంటికి వచ్చి, ఇంటి పనులు పూర్తి చేసి తన ఇంటికి వెళుతూ, దారిలో ఏదో గుర్తుకు వచ్చి మళ్ళీ గ్రామాధికారి ఇంటికివచ్చాడు.
 
ఆ సమయంలో ఇంటి తలుపులు దగ్గరకు వేసివున్నాయి. లోపల నుంచి రంగమ్మ తనకొడుకు గురించి రాజయ్యతో ఏదో చెపుతూ వుండడంతో, నందెయ్య గుమ్మం దగ్గరే ఆగిపోయి, చెవులు రిక్కించాడు. తమనే నమ్ముకున్న నందెయ్య కొడుకుకు ఉద్యోగం వేయించమని ఆమె, భర్తను అడుగుతున్నది.
 
ఇందుకు రాజయ్య, ‘‘చూడు, నీ అంత అమాయకురాలెక్కడా వుండదు! నందెయ్య కొడుక్కి ఉద్యోగం వస్తే, తనకు ఓపిక ఉడిగిపోయిందని, వాడు మన దగ్గర చేస్తూన్న ఉద్యోగం మానేసి కొడుకు దగ్గరకు వెళ్ళిపోవడం ఖాయం.

అదే ఉద్యోగం రాకపోతే, తన తరవాత ఉద్యోగంలో కొడుకునే ప్రవేశపెడతాడు. మనకు మంచి నౌకరుకావాలంటే నువ్వు, నందెయ్య కొడుక్కు ఉద్యోగం వేయించమని అడక్కూడదు,'' అన్నాడు.
 
‘‘నిజమే! మీ ముందుచూపు నాకు లేకపోయింది,'' అన్నది రంగమ్మ.
 
నందెయ్యకు ఆ మాటలు చెవిన పడగానే మతిపోయినట్లయింది. వాడు గిరుక్కున వెను దిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు.
 
ఆ రోజు నందెయ్య ఇంటికి అతడి బావమరిదివచ్చాడు. అతడికి పెళ్ళీడు కొచ్చిన కూతురుంది. ఆమెను నందెయ్య కొడుక్కివ్వాలని ఆశపడుతున్నాడు. నందెయ్య ఎవరితోనూ మాట్లాడకుండా భోజనం చేసేసి గదిలోకి వెళ్ళాడు. అతడి భార్యా, బావమరిది వెనకగా గదిలోకి వెళ్ళారు.
 
బావమరిది, నందెయ్యను, ‘‘ఏమిటి బావా, ఏదో విచారంలో వున్నట్టున్నావు?'' అంటూ నవ్వుతూ అడిగాడు.
 
నందెయ్య, గ్రామాధికారి ఇంటిలో తను విన్న సంభాషణ గురించి చెప్పి, ‘‘నా కొడుకు, నా తరవాత నౌకరుగా పనిచేయడం గురించి, నేను బాధపడను. కానీ, విశ్వాసాన్ని బానిసత్వంగా భావించే వారి వద్ద పనిచేసినందుకు దిగులుతో కుంగిపోతున్నాను,'' అన్నాడు.
 
పరిస్థితి గ్రహించిన నందెయ్య బావమరిది, ‘‘బావా! నీ విలువ తెలిసి గ్రామాధికారి నిన్ను గౌరవించడమే కాక, నా మేనల్లుడికి జమీందారుగారి దివాణంలో ఉద్యోగం వచ్చేలా సిఫార్సు చేసేందుకు, నేనో ఉపాయం ఆలోచించాను,'' అన్నాడు.
 
నందెయ్య అదేమిటన్నట్టు చూశాడు. అప్పుడు అతడి బావమరిది, ‘‘గ్రామాధికారితో నువ్వు పనిమానేయదలుకున్నాననీ, నీ కొడుకుకు దివాణంలో కాకపోతే, నీస్థానంలో గ్రామనౌకరుగా అయినా ఉద్యోగానికి జమీందారుకు సిఫార్సు చెయ్యమనీ అడుగు. తర్వాత కథ నేను నడుపుతాను,'' అని, తానేం చెయ్యదలచుకున్నదీ చెప్పాడు.
 
‘‘ఇది జరిగే పనేనా?'' అంటూనే నందెయ్య అంగీకరించాడు. ఆ మర్నాడు మామూలుగానే నందెయ్య గ్రామాధికారింటికి వెళ్ళాడు. రంగమ్మ నందెయ్యతో, ‘‘రాత్రి నీ గురించి ఆయనతో మాట్లా డాను.

ఒక నెల రోజుల లోపల దివాణంలో ఉద్యోగానికి ఎవర్నో ఒకర్ని ఎంపిక చేయాలట. ఖాళీలు రెండున్నాయట కదా! అందులో ఒక ఉద్యోగం మాత్రమే, మీ అయ్యగారి చేతిలో వుంది. మీవాడికన్న అర్హతగల వాళ్ళు వున్నారు. అందుచేత, పనిలో పనిగా - నువ్వు వయసుపైబడిన కారణంగా నీ కొడుక్కు ఉద్యోగం ఇమ్మని అర్జీ పెట్టుకున్నావనుకో, ఏ కారణం చేతనైనా ఆ ఉద్యోగం రాకపోతే, వంశపారంపర్యం హక్కుగా నీ ఉద్యోగం నీ కొడుక్కు వచ్చేస్తుంది. ఒకవేళ దివాణంలోనే ఉద్యోగం వచ్చినా రావచ్చు. ఈలోగా నీ కొడుకు గురించి, మీ అయ్యగారికి నేను నాలుగు మంచి ముక్కలు చెబుతాను. వాడిని నీ స్థానంలో నౌకరీలో ప్రవేశపెట్టడానికి తటపటాయించకు,'' అన్నది.
 
ఇందుకు నందెయ్య వినయంగా, ‘‘అమ్మగారూ! మీకు తెలుసుగదా. నా తమ్ముడు, వాడి భార్య పోవడం చేత, చిన్నతనం నుంచీ వాడి కొడుకును కూడా నేనే పెంచాను. నా కొడుకు పేరు జయుడైతే, వాడి పేరు విజయుడు. నా తరవాత నేను చేసే ఉద్యోగంలో వాళ్ళల్లో ఎవరో ఒకరికివ్వాలని మీకనిపిస్తే - ఒక నెల రోజుల పాటు, నా బదులుగా ఇద్దర్నీ మీ దగ్గర వుంచుతాను. నా కొడుక్కు దివాణంలో ఉద్యోగం వస్తే మంచిదే. లేకపోతే మీకు నచ్చితే నా తమ్ముడి కొడుకు విజయుడిని, నా స్థానానికి సిఫార్సు చేయండి,'' అన్నాడు. రంగమ్మ సరేనని భర్త కచ్చేరీ నుంచి రాగానే ఆయనకు విషయం చెప్పింది.
 
రాజయ్య కొద్ది సేపు ఆలోచించి, ‘‘నందెయ్య కోరిక కొంత సబబుగానే వుంది. ఆ జయ విజయులిద్దర్నీ మన పక్క గ్రామంలోని గ్రామాధికారి మునెయ్య వద్ద తాత్కాలికంగా నౌకరీలోవుంచుతాను. ఆ తర్వాత, ఆ ఇద్దరిలో ఎవడు గ్రామనౌకరుగా పనికి వస్తాడో, ఎవడు కచ్చేరీ ఉద్యోగానికి అర్హుడో, ఆయన అభిప్రాయం అడుగుతాను,'' అన్నాడు.
 
రంగమ్మ ద్వారా గ్రామాధికారి ఆలోచన ఏమిటో విన్న నందెయ్య, సంగతి తన బావమరిదికి చెప్పి, ‘‘జయుడికి దివాణం ఉద్యోగం వచ్చేందుకు ఏదో ఉపాయం వున్నదన్నావుకదా! అదెంతవరకు ఫలిస్తుందో చూడు,'' అన్నాడు.
 
బావమరిది జయ, విజయులను పిలిచి, పక్క గ్రామం గ్రామాధికారి దగ్గర ఒక నెల పాటు చేయవలసిన నౌకరీ గురించి చెప్పి, ‘‘మీ పెదనాన్న ఎంత ప్రయత్నించినా, నీకు చదువు బాగా అబ్బిందికాదు.

దానికిప్పుడు విచారించనవసరం లేదు. జయుడికి కాస్తో కూస్తో చదువుంది. ఎలాగేనా బ్రతుకుతాడు. లేకపోతే నేనెలాగూ అల్లుడిని చేసుకునే ఉద్దేశంలో వున్నాను. కాబట్టి వాడికి నా అండవుంటుంది. పెదనాన్న కోరిక తీరాలంటే నువ్వు ఇప్పుడు మన గ్రామాధికారి పంపిన చోట వినయంగా వుంటూ మంచి పేరు తెచ్చుకో,'' అన్నాడు. ఆ తరవాత జయుడితో, ‘‘నువ్వు పనిలో చేరగానే, ఉద్యోగానికి సంబంధించిన పనులు తప్ప, ఇంటి పనులు అసలు ముట్టుకోనని చెప్పు. నీ ఉద్యోగానికి సంబంధించిన బాధ్యతలను మాత్రం చాలా జాగ్రత్తగా, నేర్పుగా పెద్దల మెప్పు పొందేలా నిర్వర్తించు. అది నీకు మేలు చేస్తుంది,'' అన్నాడు.
 
రాజయ్య పంపగా జయ, విజయులిద్దరూ పక్క గ్రామం గ్రామాధికారి మునెయ్య దగ్గరపనిలో చేరారు. జయుడు, ఆయనతో, తనకు ఉద్యోగ సంబంధమైన పనులు మాత్రమే చెప్పమనీ, ఇంటి పనులు చెప్పొద్దనీ నిర్మొహ మాటంగా చెప్పేశాడు. విజయుడు మాత్రం వృత్తి పనులతో పాటు ఇంటిపనులు కూడా చేస్తూ, మునెయ్య మెప్పు పొందాడు. నెలగడిచాక మునెయ్య, రాజయ్యను కలుసుకుని, ‘‘నీ గ్రామనౌకరు నందెయ్య కొడుకు జయుడు, తండ్రి తర్వాత గ్రామనౌకరైతే, నువ్వు ఇంటిపనులకు వేరే నౌకర్ని పెట్టుకోక తప్పదు. వాడు దురుసువెధవ. ఆ రెండో వాడున్నాడే విజయుడు, వాడిలో వినయంతో పాటు చురుకుదనం కూడా వున్నది,'' అని తన అభిప్రాయం చెప్పాడు.
 
రాజయ్య బాగా ఆలోచించి నందెయ్యను పిలిచి, ‘‘నీ తమ్ముడి కొడుకు విజయుడే నీకు తగిన వారసుడని తేలిపోయింది. వాడి వినయం, చెప్పిన పనులు మారు మాటాడకుండా చేయడం మునెయ్యకు బాగా నచ్చాయి. నీ కొడుకు చదువుకున్నవాడు గనక వాణ్ణి దివాణంలో ఉద్యోగం కోసం జమీందారుగారికి సిఫార్సు చేస్తాను,'' అన్నాడు.
 
ఇది విన్న నందెయ్య పరమానంద పడిపోతూ ఇంటికి వెళ్ళి, బావమరిదితో, ‘‘ఆహా, ఎంత తెలివిగలవాడివి; నీ ఉపాయం ఫలించింది!'' అంటూ సంగతి చెప్పి, ఆప్యాయంగా అతడి రెండు చేతులూ పట్టుకున్నాడు.
              💦🐋🐥🐬💦
          ◦•●◉✿ - ✿◉●•◦
🌻 *మహానీయుని మాట*🍁
    ◈ ━━━ ⸙ - ⸙ ━━━ ◈
_" మెరుగు పెట్టకుండా రత్నానికి, - కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. "_
          _*- చాగంటి కోటేశ్వరరావు*_
     。☆✼★━━━━★✼☆。
🌹 *నేటీ మంచి మాట* 🌼
     ♡━━━━━ - ━━━━♡
_" ఒక మూర్ఖుడు ఓ తెలివైన ప్రశ్న నుండి నేర్చుకొనేదాని కంటే, ఒక తెలివైనవాడు ఒక మూర్ఖత్వపు ప్రశ్న నుండి నేర్చుకొనేదే ఎక్కువ. "_

         💦🐋🐥🐳💦