Moral Story:53

 *నీతి కథలు - 53*


*దురాశకు పోతే దుఃఖం*

    ఒకసారి ఒక సాధు పుంగవుడు తన శిష్యులందరి పట్ల సంతుష్టుడై ‘మీకు అమోఘమైన ఒక మంత్రం ఉపదేశిస్తాను. దాన్ని సక్రమంగా ఉపయోగించుకుని జీవితాన్ని సంతోషంగా గడపండి’ అని ఒక మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని చదివి మీకేం కావాలంటే అది కోరుకోండి అది జరుగుతుంది. ఒక్కసారి మాత్రమే. దీన్ని దుర్వినియోగం చేయకండి’‘ అని చెప్పాడు. ఆ శిష్యులలో ఆశారాం అనేవాడు అసంతృప్తితో ‘స్వామీ ఇంతకాలంనుంచి మిమ్ము సేవించుకున్నాను. ఒక్క మంత్రమేనా ఉపదేశించేది?’ రెండింటిని కోరుకునేలా నాకు ఇంకో మంత్రం ఉపదేశించండి’ అని అడిగాడు. అందరు శిష్యులు ఇచ్చినదానితో తృప్తి పడితే వీనికి ఆశ ఎక్కువగా ఉంది అనుకుని ఆ సాధువు ‘అందరికీ సమానంగా మంత్రం ఉపదేశించా, నీకు ఆశ పనికిరాదు, దొరికిన దానితో తృప్తిపడాలి’ అని హితవు చెప్పాడు. కానీ ఆశారాం వినకుండా తనకు ఇంకో మంత్రం ఉపదేశించాల్సిందే అని పట్టుపట్టాడు.

    దానికా సాధువు సరేనని కోరుకున్నది జరిగేట్టు ఇంకో మంత్రం ఉపదేశించి పంపాడు. ఇంటికి వెళ్లాక ఆశారాం ‘నా ఇల్లేమిటి ఇలా దరిద్రంగా ఉంది..వట్టి మట్టికొంప, దీన్ని బంగారు ఇల్లుగా మార్చుకుంటే ఎంత బాగుంటుందో’ అనే ఆలోచన వచ్చి సాధువుచెప్పిన మొదటి మంత్రం చదివి ‘నా ఇల్లు బంగారంగాను’ (బంగారు ఇల్లు అవ్వాలని) కోరుకున్నాడు. అతని ఆశ్చర్యానికి అంతులేదు! ఇంట్లో వస్తువులతో సహా ఇల్లంతా బంగారమై మెరిసిపోతోంది. తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. ఇప్పుడు తానెంతో ధనవంతుడనని, తనకెవరూ సాటిరారని గర్వపడ్డాడు...‘ ఇలా బంగారపు ఇంట్లో బంగారు వస్తువులతో జనం మధ్యలో వుంటే అందరి కళ్లూ నామీదే ఉంటాయి. దాంతో దొంగలు దోపిడీదారులు నా ఇంటిపై కనే్నస్తారు..ఇదంతా అపహరించుకోవడానికి’ అనే భయం పట్టుకుంది. ఏం చెయ్యాలా?’ అని ఆలోచిస్తుంటే సాధువుగారు ఉపదేశించిన రెండో మంత్రముందిగా నా దగ్గర అనుకుని ఆ మంత్రం పఠించి ‘నా బంగారం నాకే కాక ఇతరులకు కనపడకుండుగాక’ అని కోరుకున్నాడు. ఇప్పడు ఆ బంగారు ఇల్లు, అందులో వస్తువులు ఆశారాంకు తప్ప ఇతరులకెవ్వరికీ కనపడడంలేదు. చుట్టుపక్కలవాళ్లు గుసగుసలాడుకుంటున్నారు. ఆశ్చర్యపడుతున్నారు. ఆశారాం కనపడుతున్నాడు, కానీ ఇల్లేమైంది. వట్టి ఖాళీ జాగాలో ఉంటున్నాడేమిటో?’అని!

    ఒకరోజు ఆశారాం తనవద్దనున్న బంగారంలో కొంత అమ్మాలనుకున్నాడు. రోజువారీ ఖర్చులకోసం డబ్బు కావాలి కదా! కొంత బంగారం పట్టుకుని బంగారం వ్యాపారి దగ్గరకు వెళ్లాడు ఆశారాం. తను కోరుకున్న రెండో వరం..తన బంగారం తనకేగానీ ఇతరుల కంటికి కనపడకుండా వుండాలన్నది మరిచిపోయాడు. వ్యాపారి వద్దకు పోయి ‘ఈ బంగారానికి ధరకట్టి డబ్బులియ్యండి’ అని బంగారం చూపించాడు. ఆ బంగారం తనకే గానీ వాళ్లకు కనపడదు కదా! దానికా వ్యాపారి ‘‘ఏమీ ఇవ్వకుండా బంగారం తీసుకుని డబ్బియ్యమంటావేమిటి? ననే్న మోసం చేద్దామనుకుంటున్నావా?’’ అని కేకలేశాడు. దాంతో ఆశారాం పక్కనున్న వారిని ‘‘చూడండయ్యా, నేను బంగారం ఇస్తుంటే ఏమీ లేదంటున్నాడీయన, ఇదేంటి, ఇది బంగారం కాదా? చూడండి’’ అంటూ చేతిలోని బంగారం చూపిస్తున్నాడు అందరికీ.

    ఆ బంగారం అతనికి తప్ప ఎవరికీ కనపడడంలేదు. అందుకని అందరూ ‘‘ పోవయ్యా వట్టి చేతులు చూపిస్తూ బంగారం ఉందంటున్నావు అందరికీ చెవిలో పువ్వులు పెడతావా? ఏది బంగారం! నీకేమన్నా పిచ్చా’’ అని ఆశారాం మాటలు ఎవరూ నమ్మలేదు. పైగా ‘పిచ్చివాడు’ అని అందరూ నవ్వడం మొదలుపెట్టి, పోరా పోరా పిచ్చోడా! అంటూ తన్ని తరిమివేశారు. పాపం! ఆశారాం ఆశపడి ఇంటిని బంగారం చేసుకున్నాడు. కానీ దురాశ అతడిని అన్నింటికీ దూరం చేసి పిచ్చివానిగా ముద్రవేసింది. ఇంటికే కాదు ఊరికీ దూరమయ్యాడు!

    చూశారా! తృప్తిలో వున్నంత సుఖం ఎందులోనూ ఉండదు. ఆశ ఉండచ్చు. కానీ తగిన మోతాదులో ఉండాలి . మోతాదు మించి మొత్తానికే మోసం దు:ఖాన్నే మిగుల్చుతుంది.
            
  ◦•●◉✿ - ✿◉●•◦
🌻 *మహానీయుని మాట*🍁
    ◈ ━━━ ⸙ - ⸙ ━━━ ◈
_" జరుగుతున్నది ఏదైనా సరే, మీరు మానసికంగా కృంగిపోవడం అన్నది ఒక పరిష్కారం కాదు. మీరు ఇలా మానసికంగా కృంగిపోవడం మరో సమస్య అవుతుంది "_
            _*- సద్గురు*_
     。☆✼★━━━━★✼☆。
🌹 *నేటీ మంచి మాట* 🌼
     ♡━━━━━ - ━━━━♡
_" ఎదుటి వ్యక్తిని నోరెత్తకుండా చేసినంత మాత్రాన అతడిని నీ దారికి తెచ్చుకున్నట్లు కాదు "_