Moral Story:35

*నీతి కథలు - 35*


*సరైన తీర్పు*

    ఒకసారి గంగాధరం, దశరధం అనే బాటసారులు ప్రయాణం చేస్తూ, చీకటి పడేసరికి ఒక అన్నసత్రంలో భోజనం చేసి పడుకున్నారు. వారిద్దరివీ వేర్వేరు ఊళ్లు, పరిచయస్ధులు కుడా కారు. గంగాధరం చెవులకు బంగారు పోగులున్నాయి. సత్రంలోకి వచ్చినప్పటి నుండి దశరధం దృష్టి గంగాధరం బంగారుపోగులపైనే ఉంది. ఎలాగైనా వాటిని కాజేయాలని గంగాధరంతో స్నేహం నటించి అతని పక్కనే పడుకున్నాడు దశరధం.

    ప్రయాణ బడలిక వల్ల గంగాధరానికి గాఢంగా నిద్రపట్టింది. బాటసారులంతా గుర్రు పెట్టి నిద్రపోతున్న సమయంలో దశరధం, కుడి చెయ్యి తలకింద పెట్టుకుని నిద్రపోతున్న గంగాధరం ఎడమచెవిపోగును జాగ్రత్తగా కాజేశాడు. అతను ఎటూ కదలకుండా అలాగే పడి ఉండటం వల్ల కుడిచెవిపోగు కాజేయలేకపోయాడు.

    తెల్లవారాక తన ముఖం చూసుకున్న గంగాధరానికి ఎడమచెవిపోగు లేకపోవడం కనిపించింది. పక్కనే ఉన్న దశరధం కుడిచెవికి తన ఎడమపోగు ఉండడం చూసి, "నీవు నా చెవి పోగు దొంగిలించావు కదా! నా చెవిపోగు నాకిచ్చేయి." అన్నాడు గంగాధరం కోపంగా. దశరధం మరింత కోపంగా, "ఏం మాట్లాడుతున్నావ్‌? నువ్వే నా చెవిపోగు తీసుకుని ఎక్కువగా మాట్లాడుతావా?" అంటూ గంగాధరం పైపైకి ఎగిరాడు.

    కొంతసేపు వాదులాట తర్వాత గంగాధరం, దశరధం న్యాయాధిపతి సమక్షానికి వెళ్లారు. వాళ్లిద్దరి వాదన విన్న న్యాయాధిపతి "మీరిద్దరూ రాత్రి ఎలా పడుకున్నారో, ఇక్కడ నేలమీద అలా పడుకుని చూపించండి" అన్నాడు న్యాయాధిపతి. వారికేమి అర్ధంకాక అలాగే పడుకున్నారు. న్యాయాధిపతి వారిద్దరినీ సమీపించి పరీక్షించి చూశాడు. అంతే దొంగెవరో ఆయనకు అర్ధమైపోయింది.

    వెంటనే దశరధాన్ని చూస్తూ "నీ చెవిపోగు గంగాధరం కాజేశాడన్నావుగా! అది ఏ చెవిపోగు "అడిగాడు న్యాయాధిపతి. తాను దొంగిలించిన చెవిపోగు కుడిచెవికి పెట్టుకుని ఉన్నాడు కాబట్టి గంగాధరం కాజేసింది ఎడమచెవిపోగని చెప్పాడు దశరధం. "దొంగ దొరికాడు. దశరధం! నేరం నువ్వే చేశావు. కుడి చెయ్యి తలకింద పెట్టుకుని పక్కకు తిరిగి నిద్రపోతున్న గంగాధరం ఎడమచెవిపోగు నువ్వే కాజేసి, అతనిపై నేరం మోపుతున్నావు. నిజం ఎప్పటికీ దాగదు" అని గంగాధరానికి చెవిపోగు ఇప్పించి దశరధానికి ఆరునెలల జైలుశిక్ష విధించాడు న్యాయాధిపతి.
          ◦•●◉✿ - ✿◉●•◦
🌻 *మహానీయుని మాట*🍁
    ◈ ━━━ ⸙ - ⸙ ━━━ ◈
_" మనలోపల శత్రువు లేనంతవరకు బయటి శత్రువు మనను భయపెట్టలేడు "_
        _*- గౌతమ బుద్ధుడు*_
     。☆✼★━━━━★✼☆。
🌹 *నేటీ మంచి మాట* 🌼
     ♡━━━━━ - ━━━━♡
_" స్వయం సమృద్ది సాధించడం ఎంత అవసరమో పరస్పరం ఆధారపడగలిగే సామరస్యాన్ని సాధించడం కూడా అంతే అవసరం. "_
****

@    Class & Subject wise Study Material :

    #    6th Class    #    7th Class    #    8th Class    #    9th Class    #    10th Class