*నీతి కథలు - 04*
*గాడిద- నక్క*
అనగనగా ఓ గాడిద. దాని కంఠం వినసొంపుగా ఉండకపోవచ్చుగాని, దానికి సంగీతశాస్త్రం గురించి బాగా తెలుసు. ఆ సంగతి అలా ఉంచితే, పొద్దంతా చాకలి మూటలు మోసి మోసి, పొద్దుపోయాక దోసపాదులుండే మెరకల మీదికి పోతుండేదది. అక్కడ కడుపు నిండా దోసాకులూ,కాయలూ మేసి వస్తుండేది. మెరకల మీదికి పోయినప్పుడే ఓ నక్కతో దానికి స్నేహం కుదిరింది.
ఒకరోజు పున్నమి, ఆవెన్నెలలో నక్కతో గాడిద ఇలా అంది ‘ఇవాళ నీ ముందు పాడాలనిపిస్తోంది.’‘కొంపదీసి పాడేవు. ప్రాణాలు పోతాయి. వద్దు.’ అన్నది నక్క.‘దొంగతనంగా మేతమేసి పోయేవాళ్ళం. గుట్టుగా వచ్చి గుట్టుగా పోవాలి. పాటలూ ఆటలూ వద్దు. ఒకవేళ నువ్వు పాడేవనుకో, ఆ పాటకి రైతు మేల్కొంటే అంతేసంగతులు. ఇద్దరికీ బడితెపూజ అయిపోతుంది. ఎందుకొచ్చిన గొడవ. వూర్కో’ అంది అంతలోనే.‘అయినా నీ గొంతులో పాటేంటి చెప్పు? నవ్వుతారెవరయినా’ అంది. అంతే! ఆ ఆ మాటకి కోపం వచ్చింది గాడిదకి.‘నా గొంతులో పాటేంటంటావా? నీకేం తెలుసు నా పాటెలాంటిదో? ఒఠ్ఠి అడవి జంతువ్వి. ఎంతసేపూ తిండి తప్ప మీకో పాటా మాటా ? ఛీఛీ’ అసహ్యించుకుంది నక్కని.‘సంగీతం నీకంత బాగా తెలుసా?’‘చాలా బాగా తెలుసు.’ అంది గాడిద. సప్తస్వరాలను పలికింది. తాళ భేదాలు చెప్పింది. వివిధ రాగాలు, గమకాలు గురించి గుక్క తిప్పుకోకుండా దీర్ఘోపన్యాసం ఇచ్చింది.
‘ఇప్పుడు చెప్పు. నా పాట వింటావా? వినవా?’ అడిగింది.తప్పదు, పాడి తీరుతుంది గాడిద. పాట వినడమే ప్రమాదం అనుకుంటే పడుకున్న రైతు మేల్కొంటే ఇంకా ప్రమాదం అనుకుంది నక్క. అయినా తెలివిగా ఇలా అంది.‘ఓ పని చేస్తాను. నేను వె ళ్ళి అదిగో అక్కడ దూరంగా నిలబడతాను. నువ్వు అప్పుడు పాడు. ఒకవేళ రైతు లేస్తే అరిచి చెబుతాను. ఆపేయ్.’ అంది నక్క.‘అలా అన్నావు బాగుంది. వెళ్ళిరా’ అంది గాడిద. అదే అదనుగా నక్క అక్కణ్ణుంచి తప్పుకుంది. గాడిద పాట ఎత్తుకుంది. పెద్దగా ఓండ్ర పెట్టసాగింది. ఎంతకీ ఆపదు. దాంతో రైతుకి మెలకువ రానే వచ్చింది. మెలకువతో పాటు బంగారంలాంటి నిద్రను చెడగొట్టినందుకు గాడిద మీద కోపం కూడా వచ్చింది. ఆ కోపంతో పెద్ద దుడ్డుకర్రను పట్టుకుని వచ్చి, గాడిదను ఇక్కడ అక్కడని గాక ఎక్కడ పడితే అక్కడ చితక్కొట్టాడు.
అయినా అతని కోపం చల్లారలేదు. దగ్గరగా ఉన్న రాతిరోలుని లాక్కొచ్చి, దాన్ని గాడిద మెడకి వేలాడదీశాడు.‘ఇప్పుడు పాడు’ అన్నాడు. వెళ్ళిపోయాడు.తిన్న దెబ్బలకి కుయ్యో మొర్రోమంటూ మెడలో రోలుతో నక్క దగ్గరగా వచ్చింది గాడిద.‘బాగుందే! నీ పాటకి మెచ్చుకుని రైతు మంచి కంఠాభరణాన్నే ఇచ్చాడు.’ అని నవ్వింది నక్క.‘పాడొద్దని చెబితే విన్నావా? పాడతానన్నావు. ఏఁవయ్యావు. పాడిప్పుడు.’ అని ఎగతాళి చేసి, నవ్వుకుంటూ అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది నక్క.
◦•●◉✿ - ✿◉●•◦
🌻 *మహానీయుని మాట*🍁
◈ ━━━ ⸙ - ⸙ ━━━ ◈
_" చిన్న చిన్న విషయాలలో సత్యంగా వుండని వారు ప్రాముఖ్యమైన విషయాలలో నమ్మకంగా వుండరు "_
_*- అల్బెర్ట్ ఐన్ స్టీన్*_
。☆✼★━━━━★✼☆。
🌹 *నేటీ మంచి మాట* 🌼
♡━━━━━ - ━━━━♡
_" వనరులూ వసతులూ కాదు, ఎవరి విజయానికైనా ఆలోచనా విధానమే మూలం "_
💦🐋🐥🐳💦