Moral Story: 77

 *నీతి కథలు - 77

*ఎవరిని అడగాలి?*

    సూర్యం, చంద్రం బాల్యస్నేహితులు. ఇద్దరూ ధర్మవరంలోని జ్ఞానానంద విద్యాలయంలో చదువుకున్నారు. సూర్యం ఉపాధ్యాయవృత్తిని చేపట్టాడు. చంద్రం అదే ఊళ్ళోని జమీందారు దివాణంలో ఉన్నతాధికారిగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరూ మంచి స్నేహితులే గాని, ఒక విషయంలో మాత్రం భిన్న ధ్రువాలుగా ఉండేవారు. సూర్యం ఏ విషయంలోనైనా నలుగురితో చర్చించిగాని, ఒక నిర్ణయూనికి వచ్చేవాడు కాదు.
 
    ఒకవేళ తనే స్వయంగా ఒక నిర్ణయం తీసుకున్నా, ఆ విషయం సరైనదే అని ఎదుటివారు ఒప్పుకుంటే తప్ప అతనికి తృప్తి వుండేది కాదు. అయితే, చంద్రం ఏ విషయూన్నయినా ఒకటికి నాలుగుసార్లు తనే బాగా ఆలోచించి ఒక నిర్ణయూనికి వచ్చేవాడు. ఆ తరవాత ఎవరు ఏం చెప్పినా, చివరకు తప్పు పట్టినా ఒప్పుకునేవాడు కాదు. ఒక విషయూన్ని పదిమందితో చర్చించడం వల్ల గందరగోళం తప్ప, పెద్ద ప్రయోజనం ఒరగదని అతడి దృఢవిశ్వాసం. ఇద్దరు స్నేహితులూ కనీసం వారానికి ఒక్కసారయినా కలుసుకునేవారు.
 
    ప్రతి శనివారం సాయంకాలం ఊరికి ఉత్తరంగా ఉన్న చిన్న కొండపై వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయూనికి వెళ్ళి వచ్చేవారు. కొండ దిగుతూ ఆ వారంలో జరిగిన విశేషాలు, మంచిచెడ్డలు మాట్లాడుకోవడం వాళ్ళ అలవాటు. అలా ఒక శనివారం మిత్రులిద్దరూ స్వామి దర్శనం కోసం కొండ మెట్లెక్కుతూండగా ఎదురుపడ్డ ఒక పెద్దమనిషి, ‘‘ఆలయం తలుపులు మూసేశారు. పూజారి లేరు,'' అని చెబుతూ కిందికి దిగి వెళ్ళాడు. ‘‘అరరె, ఇంత… దూరం వచ్చి వృథా అయి పోయిందే,'' అంటూ కంగారుపడసాగాడు సూర్యం. ‘‘ఎవరో చెప్పిన మాటవిని అలా బెంబేలు పడతావెందుకు?'' అన్నాడు చంద్రం.


    ‘‘ఇంకెవరినైనా అడుగుదాం,'' అంటూ ఎదురుపడ్డ ఇంకో వ్యక్తిని ఆపి, ‘‘ఆలయం తలుపులు తెరిచి ఉన్నాయూ?'' అని అడిగాడు సూర్యం. ‘‘తెలియదు బాబూ,'' అంటూ వెళ్ళి పోయూడా వ్యక్తి. ‘‘ఇంతదూరం రానే వచ్చాం. వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా? వచ్చేపోయేవాళ్ళను ఆరా తీయడం దేనికి?'' అంటూ ముందుకు వెళ్ళాడు చంద్రం. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే, ఆలయం తలుపులు తెరిచే ఉన్నాయి.
 
    స్వామి దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చారు మిత్రులు. ‘‘చూశావా సూర్యం? ఎవడో, ఎందుకు చెప్పాడో ఏమో. గుడి తలుపులు తెరిచే ఉన్నాయికదా. అందుకే ఎదుటివాళ్ళు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మకూడదు. సొంతబుద్ధితో ఆలోచించాలి. అంతేకాదు; ఎవరిని అడగాలి? ఎవరిని అడగకూడదు అన్న విషయంలోనూ జాగ్రత్త వహించాలి,'' అన్నాడు చంద్రం. అంతలో మెట్లపై కూర్చున్న బిచ్చగాడొకడు, ‘‘ధర్మం చేయండి, బాబూ,'' అన్నాడు. సూర్యం భిక్షాపాత్రలో పావలా వేశాడు.
 దాన్ని చూసిన బిచ్చగాడు, ‘‘ధర్మప్రభువులు లోగడ రూపాయి వేసేవారు. ఇప్పుడు పావలా వేశారేమిటి?'' అన్నాడు. ‘‘అవును, ఆ రోజుల్లో నాకు పెళ్ళికాలేదు. ఒంటరివాణ్ణి. ఖర్చుల్లేవు. రూపాయి వేసేవాణ్ణి. పెళ్ళయ్యూక ఇంటి బాధ్యతలు పెరిగాయి. అందువల్ల అర్ధరూపాయి వేసేవాణ్ణి. ఇప్పుడేమో పిల్లలు చదువుకుంటున్నారు. రేపు వాళ్ళకు పెళ్ళిళ్ళూ అవీ చేయూలి కదా? అందుకనే పావలా వేస్తున్నాను.
 
    నా నిర్ణయం సరైనదే కదా?'' అని అడిగాడు సూర్యం బిచ్చగాణ్ణి. ‘‘అంటే, నాకు చెందవలసిన డబ్బుతోనే మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయూలనుకుంటున్నారా బాబూ?'' అన్నాడు బిచ్చగాడు. ఆ మాటకు సూర్యం నిర్ఘాంతపోయూడు. ‘‘చూశావా సూర్యం! ఏదైనా అభిప్రాయం అడగాలన్నా అర్హులైనవారినే అడగాలి. లేకుంటే ఇలాంటి వ్యాఖ్యలు వినక తప్పదు,'' అన్నాడు చంద్రం విరగబడి నవ్వుతూ.
              💦🐋🐥🐬💦
          ◦•●◉✿ - ✿◉●•◦
🌻 *మహానీయుని మాట*🍁
    ◈ ━━━ ⸙ - ⸙ ━━━ ◈
_" వాదనలు నిష్ప్రయోజనమైనవి. వాటికీ దూరంగా ఉండండి. "_
           _*- ఆస్కార్ వైల్డ్*_
     。☆✼★━━━━★✼☆。
🌹 *నేటీ మంచి మాట* 🌼
     ♡━━━━━ - ━━━━♡
_" బద్దకస్తునికి ఇష్టమైన పదం ‘రేపు’ "_

         💦🐋🐥🐳💦